Published : 09 Aug 2022 06:09 IST

Venkaiah naidu: చట్టసభల గౌరవాన్ని కాపాడాలి

అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం శత్రువులుగా చూసుకోవద్దు

వాజ్‌పేయీ, ఆడ్వాణీ వెన్నుతట్టి ప్రోత్సహించారు

10వ తేదీ తర్వాత నాకు ‘స్వాతంత్య్రం’ వస్తుంది.. ఎవ్వరినైనా కలవొచ్చు

వీడ్కోలు కార్యక్రమాల్లో వెంకయ్యనాయుడి వ్యాఖ్యలు

ఈనాడు, దిల్లీ: చట్టసభల్లో విలువల పరిరక్షణకు సభ్యులందరూ కృషిచేయాలని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. తాము ప్రత్యర్థులమే తప్ప.. శత్రువులం కాదన్న సంగతిని అధికార, ప్రతిపక్ష నాయకులు గుర్తుంచుకోవాలని సూచించారు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు పోటీపడాలే తప్ప, ఒకరినొకరు తొక్కుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించొద్దని హితవు పలికారు. రాజ్యసభలో, స్థానిక జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో సోమవారం తనకు ఏర్పాటుచేసిన వీడ్కోలు కార్యక్రమాల్లో వెంకయ్యనాయుడు సోమవారం ప్రసంగించారు. ఆ ప్రసంగాల వివరాలు ఆయన మాటల్లోనే..

మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అద్భుతమైన రాజ్యాంగం మనకు ఉంది. పెద్దల సభగా రాజ్యసభ గొప్ప బాధ్యత నిర్వర్తించాలి. ప్రస్తుతం ప్రపంచమంతా మనవైపు చూస్తున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సభా గౌరవ మర్యాదలను కాపాడాలి. హుందాగా వ్యవహరించాలి. అప్పుడే ప్రజలు మనం చెప్పేదాన్ని వింటారు. విద్యార్థులు, గ్రామీణులు పార్లమెంటు నడుస్తున్న తీరును చూస్తున్నారు. అందుకే అప్పుడప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. సభ్యులను సస్పెండ్‌ చేయడం సంతోషకరమైన విషయమేమీ కాదు. విధిలేని పరిస్థితుల్లోనే అలా చేయాల్సి వచ్చింది. ఎవరిపట్లా దురుద్దేశం లేదు. రాజ్యసభ ఛైర్మన్‌గా సభ గౌరవాన్ని కాపాడటానికి ప్రయత్నించాను. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ఎంపీలకు మాట్లాడే అవకాశం కల్పించాను.

బిల్లులను అలా ఆమోదించొద్దు

చట్టసభల్లో గందరగోళం మధ్య బిల్లులను ఆమోదించడం సరికాదు. కాబట్టి ప్రతిపక్షాలు అలాంటి వాతావరణం కల్పించకూడదు. ప్రభుత్వమూ అలా బిల్లులను పాస్‌ చేసుకోకూడదు. ఇది నా సూచన. నా తర్వాత ఈ స్థానంలోకి వచ్చేవారు దాన్ని పాటిస్తారని భావిస్తున్నాను. సభను అడ్డుకునేలా వ్యవహరిస్తేనే మీడియాలో వార్తలొస్తున్నాయి. నిర్మాణాత్మక ప్రసంగాలను పట్టించుకోవడం లేదు. అది మీడియా బలహీనతగా మారిపోయింది. దాన్నుంచి వార్తాసంస్థలు సాధ్యమైనంత త్వరగా బయటపడాలి.

ఆలోచనలను ప్రజలతో పంచుకోవాలి

చిన్నప్పుడే తల్లి మరణించినా నాకు అన్నీ దక్కాయి. విద్యార్థి నాయకుడి నుంచి ఈ స్థాయి వరకు వచ్చాను. వాజ్‌పేయీ సమావేశాల గురించి ఊరంతా ప్రచారం చేసేవాణ్ని. విశ్రాంతి తీసుకుంటే నాకు అలసట పెరుగుతుంది. నాకు తెలిసిందల్లా ప్రజలతో మమేకమవడమే. కమ్యూనికేషన్‌ అనేది చాలా ముఖ్యం. మన ఆలోచనలను ప్రజలతో పంచుకోవాలి. చట్టసభల్లో మర్యాదపూర్వకంగా (డిగ్నిటీ), హుందాగా (డీసెన్సీ), గౌరవంగా (డెకోరం), చర్చ, సంవాదం (డిబేట్‌, డిస్కషన్‌) చేపట్టిన తర్వాత నిర్ణయం (డెసిషన్‌) తీసుకోవాలి. అడ్డుకోవడం (డిస్‌రప్షన్‌) మంచిది కాదు. 10వ తేదీ తర్వాత నాకు ప్రొటోకాల్స్‌ నుంచి స్వాతంత్య్రం లభిస్తుంది. ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్లి ఎవ్వరితోనైనా కలిసే అవకాశం లభిస్తుంది. ఇక జనంతో మరింతగా మమేకమవుతా.

తల్లి మరణం ప్రస్తావనతో కన్నీటిపర్యంతం

రాజ్యసభలో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యుడు డెరెక్‌ ఓబ్రెయిన్‌ మాట్లాడుతూ.. వెంకయ్యనాయుడికి ఏడాది వయసున్నప్పుడే ఎద్దు పొడవడంతో ఆయన తల్లి మరణించిన విషయాన్ని గుర్తుచేశారు. అంత చిన్న వయసులో మాతృమూర్తిని పోగొట్టుకున్న వ్యక్తి ఇంత ఉన్నత స్థాయికి ఎదగడం గొప్ప విషయమని పేర్కొన్నారు. తన విజయగాథను స్వీయ జీవిత చరిత్రగా తీసుకురావాలని ఉప రాష్ట్రపతిని కోరారు. తన తల్లి మరణం గురించి ఓబ్రెయిన్‌ ప్రస్తావించగానే వెంకయ్యనాయుడు కన్నీటిపర్యంతమయ్యారు. 

సింహంతో పోల్చిన తిరుచ్చి శివ

వెంకయ్యనాయుడిని డీఎంకే సభ్యుడు తిరుచ్చి శివ సింహంతో పోల్చారు. ‘‘అడవిలో సింహ ఒక్కటే నిలబడి వెనక్కి తిరిగి చూస్తుంది. తాను వేసిన దారిని చూసుకోవాలన్న ఉద్దేశంతోనే అలా చేస్తుంది. ఆ దారే జంతువులన్నీ క్రమశిక్షణతో నడిచేలా చేస్తుంది. మీరూ అలాంటి సింహమే. మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో గొప్ప మార్గం ఏర్పాటుచేశారో తెలుస్తుంది’’ అని ఉప రాష్ట్రపతిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గతంలో రాజ్యసభ ముందు దస్త్రాలు ఉంచే సమయంలో సభ్యులు ‘ఐ బెగ్‌..’ అని యాచించేవారని.. బ్రిటిష్‌ కాలం నాటి ఆ బానిస విధానాన్ని వెంకయ్యనాయుడు తొలగించారని తిరుచ్చి శివ గుర్తుచేశారు. దిగ్గజ నటుడు ఎస్వీ రంగారావును తెరపై చూసినప్పుడల్లా తనకు వెంకయ్యనాయుడే గుర్తొస్తారని పేర్కొన్నారు.

* ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి అయిదేళ్ల పదవీకాలం గురించి వివరిస్తూ రూపొందించిన కాఫీటేబుల్‌ బుక్‌ను ప్రధాని మోదీ విడుదల చేశారు.

మాతృభాషకు పెద్దపీట వేద్దాం

తొలుత మాతృభాషలో మాట్లాడి.. తర్వాత ఎన్ని భాషల్లో మాట్లాడినా మంచిదే. పార్లమెంటు, అసెంబ్లీలు, పాఠశాలలు, కళాశాలలు, పరిపాలన వ్యవహారాల్లో మాతృభాషను ఉపయోగించాలి. రాజ్యసభలో అందరి ప్రసంగాలను అనువాదం చేసే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నాం. నేను పదవీ విరమణ చేసే రోజున సంబంధిత దస్త్రంపై సంతకం చేయబోతున్నా. నేను వైదొలిగిన తర్వాత కూడా సభలో మాతృభాషల వినియోగం జరగాలన్నదే నా ఉద్దేశం. న్యాయస్థానాల్లో వాదనలు భారతీయ భాషల్లో జరగాలి. 


నేనెవరి కాళ్లూ మొక్కలేదు

నా రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎవరి కాళ్లూ మొక్కలేదు. వాజ్‌పేయీ, ఆడ్వాణీలను నేను దైవ సమానులుగా భావించా. వారి కాళ్లకు మాత్రం ఎప్పుడూ నమస్కరించలేదు. అయినప్పటికీ వారిద్దరూ ఎంతో ప్రేమ, ఆప్యాయతలతో నన్ను ప్రోత్సహించారు. నిరంతర శ్రమే నన్ను ముందుకు నడిపించింది. పార్లమెంటు సభ్యులంతా కష్టపడి పనిచేయాలి. జ్ఞానాన్ని సముపార్జించుకోవడానికి ప్రయత్నించాలి. ‘దేశమంటే మట్టి కాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్‌’ అని తెలుగు కవి గురజాడ అప్పారావు చెప్పారు. ప్రజా సంక్షేమమే అత్యంత ముఖ్యం అన్నది దానర్థం. ఎన్ని వైరుద్ధ్యాలున్నా.. మనమంతా భారతీయులమన్న సంగతిని గుర్తుంచుకోవాలి.


ఉపాధ్యాయుడిలా పాఠాలు నేర్పించారు

ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి పదవీకాలం చరిత్రాత్మకం. ఆయన లేని లోటు ఇకపై రాజ్యసభలో తప్పనిసరిగా కనిపిస్తుంది. వెంకయ్యనాయుడు గత అయిదేళ్లలో పెద్దల సభను అద్భుతంగా నిర్వహించారు. సభా గౌరవాన్ని పెంచారు. ఆయన నిర్ణయాల ప్రభావం చరిత్రపై ఉంటుంది. భాజపా కార్యకర్తగా, సహాయమంత్రిగా వెంకయ్యనాయుడితో కలిసి పనిచేశాను. ఆయన నాకు ఎన్నో అంశాలు నేర్పించారు. నేను తొలిసారి ఎంపీ అయిన నాలుగు రోజులకే పార్లమెంటులో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలో చెప్పి ప్రోత్సహించారు. దేశ క్షేత్రస్థాయి వాస్తవాలను చాలా సూక్ష్మంగా అర్థం చేసుకున్నారు కాబట్టే ఆయన సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండగలిగారు. అభిప్రాయభేదం ఉండొచ్చుకానీ మనోభేదం ఉండొద్దనేది వెంకయ్యనాయుడి ఉద్దేశం. ఆయన నిరంతరం ఉపాధ్యాయుడిలా పాఠాలు నేర్పించారు. సమయపాలనలో ఆయన కనబరిచే నిబద్ధత స్ఫూర్తిదాయకం.

- పీయూష్‌ గోయల్‌, రాజ్యసభాపక్ష నేత


పదాలతో ఆడుకుంటారు

నేను ఎంపీ అయిన తర్వాత వెంకయ్యనాయుడితో కలిసి సంప్రదింపుల కమిటీలో పనిచేశాను. అప్పుడు తెలిసింది హోంవర్క్‌ చేయకుండా వచ్చి ఆయనతో కలిసి పనిచేయడం అంత సులభం కాదని. గ్రామీణ భారతీయ మూలాలు సంపూర్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తి ఆయన. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా వెంకయ్యనాయుడితో కలిసి పనిచేయడాన్ని గౌరవంగా భావిస్తున్నా. పదాలతో ఆడుకోవడం అనేది ఆయనకు దేవుడిచ్చిన వరం. ఎంత గంభీరమైన విషయాన్నయినా చతురతతో చెప్పి ఒప్పించడం ఆయనకే చెల్లింది. వెంకయ్యనాయుడు ఆలోచనలు మూర్తీభవించిన వ్యక్తి.

- హరివంశ్‌, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌


వజ్రంలా కఠినం.. పుష్పంలా సున్నితం..

వెంకయ్యనాయుడు వజ్రంలా కఠినంగానూ ఉంటారు. పుష్పంలా సున్నితంగానూ ఉంటారు. దక్షిణ భారత వస్త్రధారణను నిరంతరం కొనసాగిస్తూ ఆ ప్రాంతానికి గుర్తింపు తెచ్చారు. సొంత భాషను, ఊరిని, వస్త్రధారణను మరిచిపోకుండా మూలాలను అంటిపెట్టుకున్న వ్యక్తినని నిరూపించుకున్నారు.

- ప్రహ్లాద్‌ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని