Punjab: 75ఏళ్ల తర్వాత పాక్‌లో అన్న కుమారుడిని కలుసుకున్న పంజాబ్‌ వృద్ధుడు

 దేశ విభజన నేపథ్యంలో పాకిస్థాన్‌లో ఉండిపోయిన తన అన్నయ్య కుమారుడు మోహన్‌సింగ్‌ను పంజాబ్‌కు చెందిన 92 ఏళ్ల సర్వణ్‌ సింగ్‌ దాదాపు 75ఏళ్ల తరువాత సోమవారం కలుసుకున్నారు. పాక్‌లోని చారిత్రక కర్తార్‌పుర్‌ సాహెబ్‌

Updated : 09 Aug 2022 07:16 IST

జలంధర్‌, లాహోర్‌:  దేశ విభజన నేపథ్యంలో పాకిస్థాన్‌లో ఉండిపోయిన తన అన్నయ్య కుమారుడు మోహన్‌సింగ్‌ను పంజాబ్‌కు చెందిన 92 ఏళ్ల సర్వణ్‌ సింగ్‌ దాదాపు 75ఏళ్ల తరువాత సోమవారం కలుసుకున్నారు. పాక్‌లోని చారిత్రక కర్తార్‌పుర్‌ సాహెబ్‌ గురుద్వారా ఇందుకు వేదికైంది. ‘‘కర్తార్‌పుర్‌ సాహిబ్‌ దగ్గరకు వచ్చిన మోహన్‌సింగ్‌ (ఖలిక్‌ సాహిబ్‌) తన చిన్నాన్న పాదాలను తాకి నమస్కరించారు. కొన్ని నిమిషాలపాటు కౌగిలించుకుని ఉండిపోయారు’’ అని ఖలిక్‌ కుటుంబసభ్యుడు తెలిపారు. ఇద్దరూ నాలుగు గంటలపాటు మాట్లాడుకున్నారని, ఇన్నాళ్లూ ఎలా జీవించిందీ, ఎలాంటి కష్టనష్టాలు అనుభవించిందీ పంచుకున్నారని చెప్పారు. పంజాబ్‌కు చెందిన సర్వణ్‌సింగ్‌ కుటుంబం పాక్‌లోని సింధ్‌ ప్రాంతంలో ఉండేది. దేశ విభజన సమయంలో చెలరేగిన మతఘర్షణల్లో ఆయన కుటుంబంలోని 22 మంది మరణించారు. సర్వణ్‌సింగ్‌ భారత్‌కు వచ్చేశారు. ఆ అల్లర్ల నుంచి తప్పించుకున్న మోహన్‌సింగ్‌ ప్రాణాలతో బయటపడినా భారత్‌లోకి ప్రవేశించలేకపోయాడు. పాకిస్థాన్‌లోనే ఉండిపోయాడు. మరోవైపు, మోహన్‌సింగ్‌ను పెంచి పెద్దచేసిన పాకిస్థాన్‌లోని ముస్లిం కుటుంబం అతడికి ఖలిక్‌ సాహిబ్‌ అని పేరుపెట్టింది. అప్పటి నుంచి ఎవరి బతుకులు వారివి. ఇటీవల పంజాబ్‌లోని జాండియాలాకు చెందిన ఓ యూట్యూబర్‌ దేశ విభజన నాటి కథనాలను రూపొందిస్తూ... సర్వణ్‌ సింగ్‌ జీవిత వివరాలతో కూడిన ఒక ఇంటర్వ్యూని యూట్యూబ్‌లో పోస్ట్‌ చేశారు. ఆ వీడియోలో మాట్లాడుతూ.. తన్న అన్న కుమారుడి చేతికి ఆరు వేళ్లు ఉంటాయని.. తొడపై పెద్ద పుట్టుమచ్చ ఉంటుందని సర్వణ్‌సింగ్‌ పేర్కొన్నారు. అలాగే పాకిస్థాన్‌కు చెందిన మరో యూట్యూబర్‌ కూడా మోహన్‌ సింగ్‌ వివరాలను పోస్ట్‌ చేస్తూ ఈ ఆధారాలనే ప్రస్తావించారు. కాకతాళీయంగా ఈ రెండు కథనాలనూ ఆస్ట్రేలియాలో ఉంటున్న పంజాబీ ఒకరు చూసి ఆ ఇద్దరినీ కలిపేందుకు సహకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని