బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఆపేయడం జీవించే హక్కును భంగపరచడమే

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టే విషయంలో బొంబాయి హైకోర్టు జాప్యం చేస్తుండటంపై సుప్రీంకోర్టు సోమవారం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్సీపీకి చెందిన అనిల్‌ దేశ్‌ముఖ్‌ (73) హోంమంత్రిగా

Published : 27 Sep 2022 05:53 IST

 మహారాష్ట్ర మాజీ మంత్రి కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య

దిల్లీ: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టే విషయంలో బొంబాయి హైకోర్టు జాప్యం చేస్తుండటంపై సుప్రీంకోర్టు సోమవారం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్సీపీకి చెందిన అనిల్‌ దేశ్‌ముఖ్‌ (73) హోంమంత్రిగా ఉన్నప్పుడు ముంబయి నగరంలో సచిన్‌ వాజే అనే పోలీసు అధికారి ద్వారా వివిధ బార్ల నుంచి రూ.4.70 కోట్లు వసూలు చేశారనే అభియోగంతో ఈడీ కేసు పెట్టింది. కేసులో 2021 నవంబరులో అరెస్టైన అనిల్‌ నాటి నుంచి జ్యుడీషియల్‌ కస్టడీలోనే ఉన్నారు. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, బెయిల్‌పై విచారణ వేగంగా పూర్తి చేయాలని హైకోర్టును కోరారు. అయితే... 2022 ఏప్రిల్‌ 8న ఆయన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. దీనిపై అనిల్‌ దేశ్‌ముఖ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ హిమా కోహ్లిల ధర్మాసనం ఎదుటకు విచారణకు వచ్చింది. బెయిల్‌ పిటిషన్‌ విచారణను తీవ్ర జాప్యం చేయడం ఆర్టికల్‌ 21 ఇచ్చిన జీవించే హక్కును భంగపరచడమేననే అభిప్రాయాన్ని ధర్మాసనం వ్యక్తం చేసింది. బెయిల్‌పై వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టును ఆదేశించింది.

సరోగసీ చట్టంపై కేంద్రం అభిప్రాయం కోరిన సుప్రీం

దిల్లీ: సరోగసీ (నియంత్రణ) చట్టం-2021, సహాయక పునరుత్పత్తి సాంకేతిక (నియంత్రణ) చట్టం-2021 నిబంధనలు... గోప్యత, మహిళల పునరుత్పత్తి హక్కులకు విరుద్ధంగా ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్‌ సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌ల ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. చెన్నైకు చెందిన అరుణ్‌ ముత్తువేల్‌ దీన్ని దాఖలు చేశారు. ‘‘సరోగసీ చట్టం.. వాణిజ్యపరమైన సరోగసీని పూర్తిగా నిషేధించింది. మహిళల పునరుత్పత్తి హక్కులను పరిమితం చేసేలా, ఏకపక్షంగా ఉంది. సహాయక పునరుత్పత్తి సాంకేతిక చట్టంలో మెడికల్‌ ప్రాక్టీషనర్లకు భారీ జరిమానాలు విధించేందుకు ఉద్దేశించిన నిబంధనలను కొట్టివేయాలి’’ అని పిటిషనర్‌ అభ్యర్థించారు.

ఎన్నికల గుర్తు కేటాయింపుపై పిటిషన్‌ తిరస్కరణ

దిల్లీ: ఎన్నికల గుర్తు కేటాయింపునకు సంబంధించిన ఓ వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎన్నికల ప్రక్రియకు ఇది అవాంతరం కలిగించేలా ఉందంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. న్యాయపరమైన సమయాన్ని వృథా చేసినందుకుగాను పిటిషనర్‌కు రూ.25 వేల జరిమానా విధించింది. ఎన్నికల గుర్తులను కేటాయించే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదని, రిటర్నింగ్‌ అధికారి మాత్రమే వాటిని కేటాయించాలంటూ ఓ న్యాయవాది దాఖలుచేసిన పిటిషన్‌ను అలహాబాద్‌ హైకోర్టు గతంలో కొట్టేసింది. దీంతో ఈ కేసు సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. దీనిపై జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌.ఓక్‌ల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ‘‘ఈ వ్యాజ్యం ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించేలా ఉంది. కేవలం వ్యాజ్యం వేయాలన్న ఉద్దేశంతోనే వ్యాజ్యాలను సృష్టిస్తూ ఉంటామా? ఇది అలవాటుగా మారకూడదు’’ అని పిటిషనర్‌ను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని