విచారణలు ప్రత్యక్ష ప్రసారమాయె

సుప్రీంకోర్టులో మంగళవారం చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశ చరిత్రలో తొలిసారిగా మూడు రాజ్యాంగ ధర్మాసనాల విచారణను యూట్యూబ్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. తొలిరోజు సుమారు 7.74 లక్షలమంది విచారణ

Published : 28 Sep 2022 06:08 IST

సుప్రీంకోర్టులో చరిత్రాత్మక ఘట్టం

తొలిరోజు వీక్షకుల సంఖ్య 7.74 లక్షలు

ఈనాడు, దిల్లీ: సుప్రీంకోర్టులో మంగళవారం చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశ చరిత్రలో తొలిసారిగా మూడు రాజ్యాంగ ధర్మాసనాల విచారణను యూట్యూబ్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. తొలిరోజు సుమారు 7.74 లక్షలమంది విచారణ ప్రక్రియలను వీక్షించారు. ఈ ఏడాది ఆగస్టు 26న అప్పటి సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ (ఆయన పదవీవిరమణ రోజు) నేతృత్వంలోని కోర్టు కార్యక్రమాలను తొలిసారి లాంఛనంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆపై నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం.. తాజాగా మూడు రాజ్యాంగ ధర్మాసనాల విచారణ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేశారు. కోర్టు నంబర్‌-1లో సీజేఐ జస్టిస్‌ యు.యు.లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈడబ్ల్యూఎస్‌ కోటాపై విచారణ నిర్వహించింది. దాన్ని సుమారు 2.72 లక్షలమంది వీక్షించారు. జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నాయకత్వంలోని ధర్మాసనం మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం, జాతీయ రాజధాని ప్రాంతంలో దిల్లీ ప్రభుత్వం అందించే సేవలపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకున్న శాసన-కార్యనిర్వాహక అధికారాల గురించి విచారణ నిర్వహించింది. ఆ దృశ్యాలను దాదాపు 4 లక్షలమంది తిలకించారు. జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌కౌల్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆల్‌ ఇండియా బార్‌ ఎగ్జామినేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించగా.. లక్షమందికిపైగా చూశారు. 

మరో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు

ప్రస్తుతమున్న మూడు రాజ్యాంగ ధర్మాసనాలకుతోడు జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్‌ ఆధ్వర్యంలో నాలుగో రాజ్యాంగ ధర్మాసనాన్ని సీజేఐ జస్టిస్‌ యు.యు.లలిత్‌ తాజాగా ఏర్పాటుచేశారు. పెద్దనోట్ల రద్దు, ప్రభుత్వ అధికారులకున్న భావప్రకటన స్వేచ్ఛ, ఆర్టికల్‌ 194(2) కింద అసెంబ్లీ సభ్యులకున్న మినహాయింపులపై ఈ ధర్మాసనం విచారణ జరపనుంది. ఆ విచారణ ప్రక్రియలనూ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ప్రస్తుతానికి ముఖ్యమైన కేసులకే పరిమితమవుతున్నప్పటికీ.. అంతిమంగా అన్ని కోర్టుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు ఏర్పాటైన నాలుగు రాజ్యాంగ ధర్మాసనాల్లో ముగ్గురు మహిళా న్యాయమూర్తులకు స్థానం కల్పించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని