దేశ భద్రతలో ఇస్రో, హెచ్‌ఏఎల్‌ కీలకం

దేశానికి భద్రత కల్పించడంలో ఇస్రో, హెచ్‌ఏఎల్‌ పాత్ర కీలకమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ఆమె మంగళవారం బెంగళూరులో హెచ్‌ఏఎల్‌లో రూ.208 కోట్లతో ఏర్పాటైన

Updated : 28 Sep 2022 06:27 IST

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

ఈనాడు, బెంగళూరు: దేశానికి భద్రత కల్పించడంలో ఇస్రో, హెచ్‌ఏఎల్‌ పాత్ర కీలకమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ఆమె మంగళవారం బెంగళూరులో హెచ్‌ఏఎల్‌లో రూ.208 కోట్లతో ఏర్పాటైన ఇంటిగ్రేటెడ్‌ క్రయోజెనిక్‌ ఇంజిన్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఫెసిలిటీ కేంద్రం (ఐసీఎంఎఫ్‌), ఐసీఎంఆర్‌ ప్రాంతీయ వైరాలజీ సంస్థ (జోనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ-ఎన్‌ఐవీ)లను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ... హెచ్‌ఏఎల్‌, ఇస్రో కలయిక దేశ రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేసింది. క్రయోజెనిక్‌ యంత్రాల తయారీ సామర్థ్యంతో ప్రపంచంలో ఎంపిక చేసిన ఆరు దేశాల్లో ఒకటిగా భారత్‌ నిలిచింది’ అని పేర్కొన్నారు. ‘మానవ జీవితాన్ని కృత్రిమ మేధస్సు, ఆటోమేషన్‌ ఇంతలా ప్రభావితం చేస్తాయని ఎవరూ ఊహించలేదు. 2047 నాటికి పటిష్ఠ భారతాన్ని సృష్టించడంలో సమష్టి కృషి అవసరం’ అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చెప్పారు. 2023 మార్చి నుంచి ఇస్రో రాకెట్లకు అవసరమైన వాస్తవిక క్రయోజెనిక్‌ యంత్రాలను సిద్ధం చేస్తామని హెచ్‌ఏఎల్‌ సీఎండీ అనంతకృష్ణన్‌ వెల్లడించారు.

* దేశవ్యాప్తంగా నాలుగు నేషనల్‌ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌ఐవీ) ప్రాంతీయ లేబొరేటరీల ఏర్పాటులో భాగంగా బెంగళూరులో దక్షిణ వలయ ఎన్‌ఐవీని రాష్ట్రపతి ప్రారంభించారు. ఐసీఎంఆర్‌ నేతృత్వంలో ఈ సంస్థలో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రబలే అంటురోగాల నివారణకు అవసరమైన ఔషధాల తయారీ, వైరస్‌ పరీక్షలు,  టీకాలను తయారు చేసేందుకు అవసరమైన వ్యవస్థలను ఏర్పాటు చేశారు. బీఎస్‌ఎల్‌ 2, బీఎస్‌ఎల్‌-3 ప్రయోగశాలలు ఉన్న ఈ సంస్థలో డెంగీ, గన్యా, రేబిస్‌, క్యాసనూరు ఫారెస్ట్‌ వైరస్‌ (కోతుల నుంచి ప్రబలే) జన్యుక్రమాలపై అధ్యయనాలు చేపడతారు. అమెరికా, ఫ్రాన్స్‌, జపాన్‌, చైనా, రష్యాల తర్వాత స్వదేశీ క్రయోజెనిక్‌ యంత్రాలను తయారు చేసే దేశాల్లో భారత్‌ నిలిచింది.

* బెంగళూరులో సెయింట్‌ జోసెఫ్‌ విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రపతి ముర్ము ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో నిర్వహించిన పౌర సన్మానాన్ని ఆమె స్వీకరించారు. సీఎం బసవరాజ బొమ్మై, గవర్నర్‌ థావర్‌ చంద్‌ గహ్లోత్‌, ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌, కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతి ప్రవీణ్‌ పొవావర్‌ పాల్గొన్నారు.


ఇప్పటికే మొదలైన క్రయోజెనిక్‌ యంత్రాల కమిషనింగ్‌ ప్రక్రియ 

ఇస్రో చేపట్టబోయే అంతరిక్ష ప్రయోగాల వాహక నౌకలకు సమర్థమంతమైన క్రయోజెనిక్‌ యంత్రాలను హెచ్‌ఏఎల్‌ తయారు చేయనుంది. మంగళవారం ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్‌ క్రయోజెనిక్‌ యంత్ర తయారీ ఫెసిలిటీ కేంద్రం (ఐసీఎంఎఫ్‌)లో ఇప్పటికే క్రయోజెనిక్‌ యంత్రాల కమిషనింగ్‌ ప్రక్రియ మొదలైంది. 2013లో ఇస్రో- హెచ్‌ఏఎల్‌ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా హెచ్‌ఏఎల్‌ ఏరోస్పేస్‌ డివిజనల్‌లో 2016 నుంచి ఐసీఎంఎఫ్‌ వ్యవస్థలను ప్రారంభించారు. ఈ కేంద్రంలో భారతీయ వాహక నౌకల క్రయోజెనిక్‌ (సీఈ20), సెమి క్రయోజెనిక్‌ (ఎస్‌ఈ-2000)ల తయారీకి అవసరమైన 70 హైటెక్‌ పరికరాలు, టెస్టింగ్‌ ఫెసిలిటీ వ్యవస్థలున్నాయి. రూ.208 కోట్లతో నిర్మించిన ఐసీఎంఎఫ్‌లో పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ-2, 3 యంత్రాలకు అవసరమైన లిక్విడ్‌ ప్రొపెల్లెంట్‌ ట్యాంకులను తయారు చేస్తారు.ఇంజిన్లలో వాడే లిక్విడ్‌, ఆక్సిడైజర్‌, గ్యాసు ట్యాంకర్ల స్థానంలో తక్కువ పరిమాణం కలిగిన లిక్విడ్‌ ఆక్సిజన్‌ (ఎల్‌ఓఎక్స్‌), లిక్విడ్‌ హైడ్రోజెన్‌ (ఎల్‌హెచ్‌2)లను తక్కువ ఉష్ణోగ్రత్తల వద్ద మండించే క్రయోజెనిక్‌ యంత్రాలను తయారు చేస్తారు. 2014లో జీఎస్‌ఎల్‌వీ-డీ5, గగన్‌యాన్‌ కోసం ప్రయోగాత్మక క్రయోజనిక్‌ యంత్రాల పరీక్ష ప్రక్రియ ముగించిన ఇస్రో భవిష్యత్తు రాకెట్లలో వీటినే వినియోగించనుంది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని