కబ్జాలపై గర్జించిన బుల్డోజర్లు

వానాకాలంలో మునుగుతున్న కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో నీటి (రాజ)కాలువలపై నిర్మించిన వివిధ అక్రమ కట్టడాల కూల్చివేత ప్రక్రియ మళ్లీ మొదలైంది. పక్షం రోజుల తరువాత గురువారం కూల్చివేతలు పునః ప్రారంభించారు. న్యాయ,

Published : 30 Sep 2022 05:33 IST

అక్రమ కట్టడాల కూల్చివేతలు పునఃప్రారంభం

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే: వానాకాలంలో మునుగుతున్న కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో నీటి (రాజ)కాలువలపై నిర్మించిన వివిధ అక్రమ కట్టడాల కూల్చివేత ప్రక్రియ మళ్లీ మొదలైంది. పక్షం రోజుల తరువాత గురువారం కూల్చివేతలు పునః ప్రారంభించారు. న్యాయ, రెవెన్యూ అభ్యంతరాల అనంతరం అధికారులు ఓ ప్రణాళిక ప్రకారం కూల్చివేతలకు ముందడుగు వేశారు. పెద్దఎత్తున వివిధ ప్రాంతాల్లో బుల్డోజర్లు, పొక్లైనర్లను రంగంలోకి దించారు. బెంగళూరు పాలికె అధికారులు ముందుండి సిబ్బందికి ఆదేశాలిస్తూ పనులు చకచకా కొనసాగించారు. బొమ్మనహళ్లి పరిధి కోడిచిక్కనహళ్లిలో రాజకాలువపై తలెత్తిన ఓ అపార్ట్‌మెంట్‌కు చెందిన భారీ ప్రహరీ తొలగించారు. 11 అడుగుల వెడల్పు వంద అడుగుల పొడవు ఉన్న కాలువ భూమిని ఆక్రమించి ఆ ప్రహరీ నిర్మించారు. సర్వే నిర్వహించిన అధికారులు అక్కడ కాలువ కబ్జాకు గురైనట్లు గుర్తించారు. పాలికె అధికారులు యంత్రాల సహాయంతో గోడ తొలగించారు. పాపయ్యరెడ్డి లేఔట్‌, శాంతినికేతన్‌ లేఔట్‌, మున్నేకోళలు, కసవనహళ్లిలో ఇదే తరహాలో ఆక్రమణలపై వేటు వేశారు. వరుసగా తొలగింపు పనులు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో ఐదువేల మీటర్ల పొడవైన కాలువ ఆక్రమణలకు గురైనట్లు సర్వేయర్లు గుర్తించి నివేదికలను పాలికె అధికారులకు అందజేశారు. దాని ప్రకారం తొలగింపు పనులు చేపట్టినట్లు అధికారులు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని