ముగిసిన సత్యపాల్‌ మాలిక్‌ శకం

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో.. అదే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా గవర్నర్‌ హోదాలో ఉన్న ఆయన ఆ చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడతారు.

Published : 02 Oct 2022 04:57 IST

అరుణాచల్‌ గవర్నర్‌కు మేఘాలయ అదనపు బాధ్యతలు

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో.. అదే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా గవర్నర్‌ హోదాలో ఉన్న ఆయన ఆ చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడతారు. ఈ అంశం ఒక్కటే కాదు.. తరచూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలతో భాజపా శ్రేణులకు సవాళ్లు విసురుతూ వచ్చిన మేఘాలయ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ (76) పదవీకాలం అక్టోబరు 3తో ముగియనుంది. ఇక కొనసాగింపునకు ఏమాత్రం అవకాశం లేకుండా.. అరుణాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బి.డి.మిశ్రకు ఆ రాష్ట్ర బాధ్యతలు అదనంగా అప్పగిస్తూ రాష్ట్రపతి భవన్‌ నుంచి శనివారం ఓ ప్రకటన వెలువడింది. గతంలో రాజ్యసభ సభ్యుడిగానూ పనిచేసిన సత్యపాల్‌ మాలిక్‌ బిహార్‌, జమ్మూకశ్మీర్‌, గోవా, మేఘాలయ.. నాలుగు రాష్ట్రాలకు గవర్నర్‌ బాధ్యతలు నిర్వహించడం విశేషం. ఈయన జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌గా ఉన్నపుడే 370 ఆర్టికల్‌ను రద్దు చేసి ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చారు. ఈ రాష్ట్రానికి గవర్నర్‌గా ఉన్న సమయంలో రెండు దస్తావేజులు తన పరిశీలనకు వచ్చినపుడు ఓ రాజకీయ పార్టీ ప్రతినిధిగా ఉన్న పెద్ద పారిశ్రామికవేత్త భారీ మొత్తంలో లంచం ఇవ్వజూపారని సత్యపాల్‌ మాలిక్‌ చేసిన ప్రకటన సంచలనం రేపింది. ఈ వ్యవహారంపై సీబీఐ రెండు కేసులను కూడా నమోదు చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌ సత్యపాల్‌ మాలిక్‌ స్వస్థలం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని