సంక్షిప్త వార్తలు (11)

మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లా విరార్‌ పట్టణంలో ఓ వ్యక్తి గర్బా నృత్యం చేస్తూ మరణించాడు. శనివారం రాత్రి నృత్యం చేస్తున్న సమయంలో మనీశ్‌ నరాప్జీ (35)అనే వ్యక్తి కిందపడిపోయాడు.

Updated : 04 Oct 2022 06:08 IST

గర్బా నృత్యం చేస్తూ యువకుడి మృతి

కుమారుడి మరణవార్త విని తండ్రి కూడా..

మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లా విరార్‌ పట్టణంలో ఓ వ్యక్తి గర్బా నృత్యం చేస్తూ మరణించాడు. శనివారం రాత్రి నృత్యం చేస్తున్న సమయంలో మనీశ్‌ నరాప్జీ (35)అనే వ్యక్తి కిందపడిపోయాడు. మనీశ్‌ను ఆయన తండ్రి సోనిగ్రా హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ పరీక్షించిన వైద్యులు మనీశ్‌ మరణించినట్లు ప్రకటించారు. కుమారుడి మరణవార్తను విన్న వెంటనే తండ్రి సోనిగ్రా ఆసుపత్రిలో కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. తండ్రీకుమారుల మరణానికి కారణం ఏమిటన్నది తెలియరాలేదు. శవపరీక్షల తర్వాతే ఈ విషయమై స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు.


దుర్గా మండపంలో అగ్ని ప్రమాదం అయిదుగురి దుర్మరణం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని భదోహి జిల్లా నాథువా గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గా మండపంలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8, 10, 12 ఏళ్ల వయసున్న ముగ్గురు పిల్లలు సహా అయిదుగురు మృతి చెందారు. 64 మంది గాయపడ్డారు. ఆదివారం రాత్రి ఈ మండపంలో ఏర్పాటు చేసిన ఓ ప్రదర్శనను తిలకించేందుకు దాదాపు 300 మంది హాజరయ్యారు. వీరిలో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు. మండపంలోని ఓ హాలోజన్‌ విద్యుత్‌ దీపం.. అధికంగా వేడెక్కడంతో పక్కనే ఉన్న విద్యుత్‌ తీగ అంటుకుంది. క్షణాల్లో మంటలు మండపం మొత్తం వ్యాపించడంతో ప్రమాదం సంభవించింది.


వైద్య నిపుణుల పర్యవేక్షణలో ములాయం

గురుగ్రామ్‌: ఆరోగ్య పరిస్థితి విషమించిన సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్‌ యాదవ్‌కు వివిధ విభాగాల ప్రత్యేక వైద్య నిపుణులు సేవలందిస్తున్నారు. అస్వస్థతతో గత కొన్ని వారాలుగా మేదాంత ఆసుపత్రిలో ఉన్న ఆయన్ని ఆదివారం అక్కడి క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌కు మార్చిన విషయం తెలిసిందే. ములాయం పరిస్థితి నిలకడగా ఉందని ఎస్పీ వర్గాలు తెలిపాయి. చికిత్సకు కావాల్సిన అన్నివిధాలైన సాయాన్ని అందిస్తామని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చినట్లు చెప్పాయి. అగ్రనేత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఉత్తర్‌ప్రదేశ్‌ అంతటా ఆలయాల్లో సమాజ్‌వాదీ కార్యకర్తలు పూజలు నిర్వహించారు.


మైనారిటీల శాఖను రద్దుచేసే యోచన లేదు: కేంద్రం

దిల్లీ: మైనారిటీల వ్యవహారాల మంత్రిత్వ శాఖను రద్దుచేసే యోచన లేదని కేంద్రం స్పష్టంచేసింది. సామాజిక న్యాయం-సాధికారత శాఖలో దీనిని విలీనం చేేయవచ్చని వెలువడిన కథనంపై ఈ మేరకు వివరణ ఇచ్చింది. ఇలాంటి ప్రతిపాదనే లేదని ట్వీట్‌ చేసింది.


సీఆర్పీఎఫ్‌, ఐటీబీపీ చీఫ్‌ల బాధ్యతల స్వీకరణ

దిల్లీ: భారత్‌-టిబెట్‌ సరిహద్దు పోలీసు దళం (ఐటీబీపీ) డైరెక్టర్‌ జనరల్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అనీష్‌ దయాళ్‌ సింగ్‌, సీఆర్పీఎఫ్‌ అధిపతిగా సుజోయ్‌ లాల్‌ థౌసెన్‌ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకూ సుజోయ్‌.. ఐటీబీపీని కూడా పర్యవేక్షిస్తున్నారు. తాజాగా ఆయన ఆ బాధ్యతలను లాంఛనంగా అనీశ్‌కు అప్పగించారు. వీరిద్దరూ 1988 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారులే. 


బెట్టింగ్‌ సైట్ల ప్రకటనల్ని స్వీకరించకండి
వార్తా వెబ్‌సైట్లు, టీవీ ఛానళ్లకు కేంద్రం సూచన

దిల్లీ: విదేశాల నుంచి పనిచేస్తున్న బెట్టింగ్‌ (జూదం, పందేలు) వెబ్‌సైట్ల వ్యాపార ప్రకటనల్ని స్వీకరించవద్దంటూ అన్ని వార్తా వెబ్‌సైట్లకు, ఓటీటీ వేదికలకు, ప్రైవేటు శాటిలైట్‌ ఛానళ్లకు కేంద్రం గట్టిగా సూచించింది. ఒకవేళ దీనిని ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం ప్రైవేటు టీవీ ఛానళ్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. డిజిటల్‌ వేదికల ద్వారా వార్తలు, వర్తమాన వ్యవహారాలను అందించేవారికి విడిగా ఇలాంటి సూచనలు ఇచ్చింది.


రేడియోలో ఓటరు అవగాహన కార్యక్రమాలు

దిల్లీ: ఎన్నికల ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కల్పించడానికి భారత ఎన్నికల సంఘం ఆల్‌ ఇండియా రేడియో సంస్థతో కలసి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘మత్‌దాతా జంక్షన్‌’ పేరిట 52 ఎపిసోడ్లను రేడియోలో ప్రసారం చేయనుంది. ఒక్కో ఎపిసోడ్‌ 15 నిమిషాలు ఉండనుంది. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌, ఎన్నికల కమిషనర్‌ అనూప్‌ చంద్ర పాండే సోమవారం లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నెల 7 నుంచి వివిధ భారతి కేంద్రాలు, పలు రేడియో స్టేషన్ల ద్వారా ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. సమాచారం, వినోదం మేళవింపుగా ఈ కార్యక్రమాలు ఉంటాయని, ముఖ్యంగా పట్టణ ఓటర్లలో పోలింగ్‌ పట్ల నెలకొన్న నిరాసక్తతను తొలగించే ఉద్దేశంతో రూపొందాయని రాజీవ్‌ కుమార్‌ చెప్పారు. భవిష్యత్తులో పోలింగ్‌ శాతం మెరుగుపడటానికి ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు ముఖ్యమని అనూప్‌ చంద్ర పాండే పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న బాలీవుడ్‌ నటుడు పంకజ్‌ త్రిపాఠీ ఇకపై ఈసీకి జాతీయ స్థాయిలో ప్రచారకర్తగా వ్యవహరిస్తారని రాజీవ్‌ కుమార్‌ ప్రకటించారు.


సీడీఎస్‌ అనిల్‌ చౌహాన్‌కు జడ్‌ ప్లస్‌ భద్రత

భారత నూతన త్రిదళాధిపతి (సీడీఎస్‌) జనరల్‌ అనిల్‌ చౌహాన్‌కు కేంద్రం జడ్‌ ప్లస్‌ భద్రత కల్పించింది. దిల్లీ పోలీసులు ఆయనకు భద్రత కల్పిస్తారని కేంద్ర హోం మంత్రిత్వశాఖ తెలిపింది. భారత అత్యున్నత సైనిక కమాండర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనిల్‌ చౌహాన్‌కు కేంద్ర హోంశాఖ ఆదేశాలతో భద్రత కల్పిస్తున్నట్టు సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు ధ్రువీకరించారు.


జమ్మూ-కశ్మీర్‌ జైళ్ల శాఖ డీజీ లోహియా హత్య

జమ్మూ: జమ్మూ-కశ్మీర్‌ జైళ్ల శాఖ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ) హెచ్‌.కె.లోహియా(57) సోమవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యారు. జమ్మూ శివారులోని ఉదయ్‌వాలాలో తన నివాసంలో ఉన్న డీజీని గొంతుకోసి హతమర్చారు. ఇంట్లో పనిచేసే వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం ఇంటి పనిచేసే వ్యక్తి పరారయ్యాడని, అతని కోసం గాలిస్తున్నామని జమ్మూ జోన్‌ అదనపు డీజీపీ ముకేశ్‌ సింగ్‌ తెలిపారు.


ఎయిర్‌ ఇండియా విమానాల్లో రుచికరమైన భోజనం

దిల్లీ: ప్రస్తుత పండగల వేళ ఎయిర్‌ ఇండియా దేశీయ విమానాల్లో (సర్వీసుల్లో) రుచికరమైన భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నష్టపోతున్న ఎయిర్‌ ఇండియాను కొనుగోలు చేసిన టాటా సంస్థ.. దాని సేవల్లో సమూల మార్పులకు కసరత్తు కొనసాగిస్తోంది. మార్కెట్‌లో వాటా పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ప్రయాణికులు ఇష్టపడేలా నాణ్యమైన, ఆరోగ్యకరమైన భోజనాన్ని అందిస్తామని ఎయిర్‌ఇండియా పేర్కొంది. అక్టోబరు 1 నుంచి ఈ మెనూ అమలవుతున్నట్లు వెల్లడించింది. అంతర్జాతీయ ప్రయాణికులకు కూడా ఇలాంటి భోజనం అందించే విషయంపై దృష్టి పెట్టామని వివరించింది. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని