సంక్షిప్త వార్తలు (13)

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్‌ యాదవ్‌ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆయనను మంగళవారం గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రి ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌(ఐసీయూ)కు మార్చారు.

Updated : 05 Oct 2022 06:44 IST

విషమంగానే ములాయం ఆరోగ్యం

గురుగ్రామ్‌: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్‌ యాదవ్‌ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆయనను మంగళవారం గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రి ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌(ఐసీయూ)కు మార్చారు. ములాయం ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.


10 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించిన హోం శాఖ

దిల్లీ:హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌, లష్కరే తోయిబా, ఇతర నిషేధిత సంస్థలకు చెందిన 10 మంది సభ్యుల్ని ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం’ (ఉపా) కింద ఉగ్రవాదులుగా గుర్తిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వీరిలో పాకిస్థాన్‌కు చెందిన హబీబుల్లా మాలిక్‌ (సాజిద్‌ జుట్‌) ఒకడు కాగా మిగిలినవారు జమ్మూ-కశ్మీర్‌కు చెంది.. ప్రస్తుతం పాక్‌లో ఉంటున్న బాసిత్‌ అహ్మద్‌ రేషి, ఇంతియాజ్‌ అహ్మద్‌ కండూ, జాఫర్‌ ఇక్బాల్‌, బిలాల్‌ అహ్మద్‌ బేగ్‌, షేక్‌ జమీల్‌ ఉర్‌ రెహ్మాన్‌ తదితరులు.


గుజ్జర్లు, బకర్వాల్‌లకు త్వరలో రిజర్వేషన్లు: అమిత్‌ షా

రాజౌరి: జమ్మూ-కశ్మీర్‌లోని గుజ్జర్లు, బకర్వాల్‌లు, పహరీ సామాజిక వర్గాలకు చెందిన పౌరులు త్వరలో రిజర్వేషన్‌ ప్రయోజనాలు పొందుతారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మంగళవారం పేర్కొన్నారు. ఆయా వర్గాలకు ఎస్టీ హోదా కల్పించేందుకు ఎటువంటి అభ్యంతరాలు లేవని, ప్రతిఒక్కరూ వారి వాటాను పొందుతారని స్పష్టంచేశారు. భారత్‌-పాక్‌ సరిహద్దుల్లోని రాజౌరిలో పిర్‌ పాంజల్‌ పర్వత ప్రాంతంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో అమిత్‌ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మూ-కశ్మీర్‌లో 370 అధికరణాన్ని తొలగించడంతో ఇక్కడి సమాజంలో అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే అవకాశం కలిగిందన్నారు. మూడు సామాజిక వర్గాల ప్రయోజనాలు పరిశీలించేందుకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఏర్పాటు చేసిన జస్టిస్‌ శర్మ కమిషన్‌ సిఫారసుల మేరకు ఈ కోటా అమలు చేయనున్నట్టు వెల్లడించారు. చట్టపరమైన ప్రక్రియ పూర్తి కాగానే ఆయా వర్గాల ప్రజలకు రిజర్వేషన్‌ ప్రయోజనాలు అందిస్తామన్నారు. జమ్మూకశ్మీర్‌లో పహరీలకు ఎస్టీ హోదా మంజూరైతే ఒక భాష మాట్లాడే సమూహానికి దేశంలో రిజర్వేషన్లు కల్పించడం ఇదే తొలిసారి కానుంది. అమిత్‌ షా పర్యటన వేళ జమ్మూకశ్మీర్‌ జైళ్ల డీజీ హత్య జరగడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపేశారు.


ప్రైవేట్‌ ఎఫ్‌.ఎం. విస్తరణకు కీలక నిర్ణయాలు

దిల్లీ: ప్రైవేటు ఎఫ్‌.ఎం. సర్వీసులు చిన్న నగరాల్లోనూ విస్తరించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకొంది. ఈ మేరకు పలు అనుమతుల మార్గదర్శకాలను సులభతరం చేసింది. ఒకే యాజమాన్యం కింద పదిహేనేళ్ల లైసెన్సు కాలవ్యవధిలో ఎఫ్‌.ఎం. రేడియో అనుమతుల పునరుద్ధరణకు ఇదివరకున్న మూడేళ్ల విండో పీరియడ్‌ నిబంధనను తొలగిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గత వారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ప్రయివేటు ఏజెన్సీల ద్వారా ఎఫ్‌.ఎం. రేడియో ప్రసార సర్వీసుల విస్తరణకు విధానపరమైన మార్గదర్శకాలను సవరిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థికంగానూ వెసులుబాటు కల్పించారు. ‘సి’, ‘డి’ కేటగిరీ నగరాల బిడ్డింగ్‌ ప్రక్రియలో రూ.కోటి నికర విలువ కలిగిన కంపెనీలను కూడా ఇకపై అనుమతిస్తారు. ఇదివరకు ఈ పరిమితి రూ.1.5 కోట్లుగా ఉండేది. రేడియో పరిశ్రమ చాలాకాలంగా కోరుకొంటున్నట్లుగా ఛానల్‌ నిర్వహణపై ఉన్న 15 శాతం జాతీయ పరిమితిని కూడా తొలగించారు. మూడోదశ కింద విధానపరమైన మార్గదర్శకాల్లో చేసిన ఈ మూడు సవరణలతో ఉద్యోగ అవకాశాలు పెరగడమే కాకుండా, ఎఫ్‌ఎం రేడియో సేవలు దేశంలోని మారుమూల ప్రాంతాల సామన్యులకు కూడా అందుబాటులోకి వస్తాయని కేంద్రం పేర్కొంది.


జడ క్లిప్పును మింగిన ఐదు నెలల చిన్నారి
సురక్షితంగా బయటకు తీసిన వైద్యుడు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో ఓ ఐదు నెలల చిన్నారి ఆడుకుంటూ.. కేశాలకు పెట్టుకునే క్లిప్పును (క్లచర్‌) మింగేసింది. దీంతో శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడింది. పాపను గమనించిన కుటుంబసభ్యులు సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లడంతో బిడ్డ క్షేమంగా ఉంది. గాజియాబాద్‌లోని ఉదల్‌ నగర్‌ ఇలాఖాకు చెందిన జితేంద్ర కోడలు రియా ఆడుకుంటూ తలకు పెట్టుకునే క్లిప్పును నోట్లో పెట్టుకుని మింగేసింది. కాసేపటికి పాప ఏడుస్తుండడంతో విషయం అర్థంకాక ఆమెను ఊరడించేందుకు తల్లి ఎత్తుకుంది. అయినా బిడ్డ ఏడుపు ఆపలేదు. తీక్షణంగా గమనించాక బిడ్డ గొంతులో ఏదో అడ్డు పడిందని అర్థమయ్యింది. కుటుంబసభ్యులు పాపను తీసుకుని ఆసుపత్రికి వెళ్లారు. వైద్యుల పరీక్షలో బిడ్డ గొంతులో క్లచర్‌ ఉన్నట్లు వెల్లడైంది. అనంతరం ఓ వైద్యుడు పాపకు చికిత్స చేసి దానిని బయటకు తీశారు.  


పంజాబ్‌లో రెండు ఉగ్ర ముఠాల గుట్టురట్టు

చండీగఢ్‌: విదేశీ ముష్కరుల ఆధ్వర్యంలో నడుస్తున్న రెండు ఉగ్రవాద ముఠాల గుట్టును రట్టు చేసినట్లు పంజాబ్‌ పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ మూకలకు పాకిస్థాన్‌కు చెందిన గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ కూడా తోడ్పాటు అందిస్తున్నట్లు చెప్పారు. ముష్కర స్థావరాల నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మొదటి కేసులో యోగ్‌రాజ్‌ సింగ్‌ అలియాస్‌ యోగ్‌ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నార్కో-ఉగ్రవాద ముఠాను కెనడాకు చెందిన లఖ్‌బిర్‌ సింగ్‌, పాక్‌కు చెందిన హర్వీందర్‌ సింగ్‌ రిండా, ఇటలీకి చెందిన హర్‌ప్రీత్‌ సింగ్‌ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తాజా దాడుల్లో ఈ ముఠా స్థావరం నుంచి ఆర్‌డీఎక్స్‌తో నిండిన టిఫిన్‌ బాంబు, రెండు అధునాతన ఏకే-56 తుపాకులు, రెండు తూటా అరలు, పిస్తోలు, తూటాలు, 2 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.  రెండో కేసులో ఐఎస్‌ఐ మద్దతున్న ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ ఉగ్రవాద ముఠా సభ్యుడు హర్‌ప్రీత్‌సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మూడు హ్యాండ్‌ గ్రెనేడ్లు, రెండు పిస్తోళ్లు, 60 తూటాలను స్వాధీనం చేసుకున్నారు.


లోహియా పనిమనిషి అరెస్ట్‌
జమ్మూ-కశ్మీర్‌ జైళ్ల శాఖ డీజీ హత్య కేసులో పురోగతి

జమ్మూ: జమ్మూ-కశ్మీర్‌ జైళ్ల శాఖ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ) హెచ్‌.కె.లోహియా(57) హత్య కేసులో ప్రధాన నిందితుడైన పనిమనిషి యాసిర్‌ లోహర్‌(23)ను పోలీసులు అరెస్టు చేశారు. హత్య జరిగిన అనంతరం యాసిర్‌ పరారవగా.. మంగళవారం కన్హాచక్‌ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. రాంబన్‌ జిల్లా హల్లా ధంద్రాథ్‌ గ్రామానికి చెందిన యాసిర్‌ను ప్రస్తుతం విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. జమ్మూ శివారులోని ఉదయ్‌వాలాలో తన నివాసంలో లోహియా సోమవారం రాత్రి హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆయన గొంతు తెగిపోవడంతోపాటు, శరీరంపై కాలిన గాయాలయ్యాయి. యాసిర్‌ సుమారు 6 నెలల నుంచి డీజీ వద్ద పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


సకర్‌మౌత్‌ క్యాట్‌ఫిష్‌ బిహార్‌లో ప్రత్యక్షం

బగాహా (బిహార్‌): అమెరికాలోని అమెజాన్‌ నదిలో కనిపించే సకర్‌మౌత్‌ క్యాట్‌ఫిష్‌ మరోమారు బిహార్‌లో కనిపించింది. పశ్చిమ చంపారన్‌ జిల్లాలోని బగాహా బ్లాక్‌ చందేర్‌పుర్‌-రత్వాల్‌ పంచాయతీ పరిధిలోని రొహువా నదిలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడి వలకు ఈ చేప చిక్కింది.  మాంసాహారి అయిన ఈ చేప భారతీయ నదిలో కనిపించడంపై మత్స్యకారులు ఆందోళన వ్యక్తంచేశారు. గతంలోనూ సకర్‌మౌత్‌ క్యాట్‌ఫిష్‌ బగాహా బ్లాక్‌లో కనిపించింది.  


తూర్పు లద్దాఖ్‌లో చైనాకు దీటుగా చర్యలు
వాయుసేనాధిపతి వి.ఆర్‌.చౌధరి వెల్లడి

దిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి చైనా కార్యకలాపాలను ఎదుర్కోవడానికి అవసరమైన చర్యలు తీసుకున్నామని భారత వాయుసేనాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వి.ఆర్‌.చౌధరి పేర్కొన్నారు. అయితే ఉద్రిక్తతలకు తావివ్వని రీతిలో వీటిని చేపట్టామని మంగళవారం ఇక్కడ విలేకరులకు తెలిపారు. ఇటీవల డ్రాగన్‌ వాయుసేనకు చెందిన యుద్ధవిమానాలు ఎల్‌ఏసీకి దగ్గరగా రావడంపై అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేలా మనకు బలమైన మిలటరీ శక్తి అవసరమని అంతర్జాతీయంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలు స్పష్టంచేస్తున్నాయన్నారు. అన్నిరకాల పరిస్థితులకు దీటుగా స్పందించేలా పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎల్‌ఏసీ వెంబడి చైనా కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు కన్నేసి ఉంచినట్లు పేర్కొన్నారు. డ్రాగన్‌ దూకుడుతో సంబంధం లేకుండా తమ పోరాట సన్నద్ధత కొనసాగుతుందని చెప్పారు.


మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌కు బెయిలు

ముంబయి: మనీలాండరింగ్‌ ఆరోపణలపై అరెస్టయిన నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌కు బాంబే హైకోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్‌పై సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లేందుకు ఈడీకి ఈ నెల 13 వరకు గడువు ఇచ్చింది. అప్పటివరకు తన తీర్పు అమలుపై న్యాయస్థానం స్టే విధించింది. ఆ తరువాత అనిల్‌ దేశ్‌ముఖ్‌ను రూ.లక్ష పూచీకత్తుపై విడుదల చేయాలని జస్టిస్‌ ఎన్‌.జె.జమదార్‌ ఆదేశించారు. ఈడీ పేర్కొన్నట్టు దేశ్‌ముఖ్‌ కుటుంబం నడుపుతున్న ట్రస్టు రాబడిలోని రెండు భాగాలు నేర ఆదాయం కిందకు రావని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. తన హోదాను దుర్వినియోగం చేస్తూ బార్లు, రెస్టారెంట్ల నుంచి రూ.4.70 కోట్లను ఆయన వసూలు చేశారంటూ ఈడీ న్యాయస్థానానికి విన్నవించింది. నాగ్‌పుర్‌ కేంద్రంగా పనిచేస్తున్న విద్యాసంస్థ శ్రీసాయి శిక్షణ్‌ సంస్థాన్‌ ట్రస్టుకు డబ్బులు మళ్లించారని ఆరోపించింది. ట్రస్టుకు నిధులను అందించడంలో అక్రమాలు లేవని హైకోర్టు అభిప్రాయపడింది.


పక్షవాతానికి జన్యుమూలాలివే..!

దిల్లీ: పక్షవాతంతో ముడిపడిన 61 కొత్త జన్యు ప్రదేశాలను అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం కనుగొంది. ఈ కొత్త ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని ఔషధాలను రూపొందిస్తే ఈ రుగ్మత నివారణ, చికిత్స సాధ్యమవుతుందని వివరించారు. గతంలో పక్షవాతానికి సంబంధించిన జన్యు అధ్యయనాలు ఐరోపా మూలాలున్నవారిపైనే సాగాయి. తాజా పరిశోధనలో భారత్‌, పాకిస్థాన్‌, ఆఫ్రికా, తూర్పు ఆసియా, ఐరోపా, లాటిన్‌ అమెరికా ప్రాంతాలవారిని పరిశీలించారు. మొత్తం 25 లక్షల మందికి సంబంధించిన డేటాను విశ్లేషించారు. వీరిలో 2లక్షల మందికి పక్షవాతం వచ్చింది. పక్షవాతంతో ముడిపడిన 61 కొత్త జన్యు ప్రదేశాలు వెలుగుచూశాయి. వీటిలో ఎఫ్‌11, కేఎల్‌కేబీ1, పీఆర్‌ఓసీ, జీపీ1బీఏ, ఎల్‌ఏఎంఎస్‌2ఈ2, వీసీఏఎం1 ప్రాంతాలు లక్ష్యంగా ఔషధాలను ప్రయోగించొచ్చని శాస్త్రవేత్తలు తేల్చారు. పరిశోధక బృందంలో దిల్లీఎయిమ్స్‌లో న్యూరాలజీ విభాగ మాజీ అధిపతి కామేశ్వర్‌ ప్రసాద్‌ కూడా ఉన్నారు.


జేడీయూను నడపమన్నారు
నీతీశ్‌ కోరికను తిరస్కరించా: ప్రశాంత్‌ కిశోర్‌

పట్నా: బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమర్‌పై రాజకీయ వ్యూహకర్త నుంచి సామాజికవేత్తగా మారిన ప్రశాంత్‌ కిశోర్‌(పీకే) తీవ్ర విమర్శలకు దిగారు. జనతాదళ్‌(యునైటెడ్‌)/జేడీయూకు నేతృత్వం వహించి పార్టీని ముందుకు నడపాలని నీతీశ్‌ తనను కోరారని మంగళవారం పీకే వెల్లడించారు. అయితే ఆ విజ్ఞప్తిని తాను తిరస్కరించినట్లు తెలిపారు. ‘‘నీతీశ్‌ కుమార్‌ ముఖ్యమంత్రి పదవిని అంటిపెట్టుకోవడంలో సిద్ధహస్తులు. తాను చాలా తెలివైన వ్యక్తినని భావిస్తుంటారు. 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక ఆయన నన్ను దిల్లీలో కలుసుకున్నారు. తనకు సాయం చేయాలని ప్రాధేయపడ్డారు. 2015 శాసనసభ ఎన్నికల్లో మహాఘట్‌ బంధన్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన్ను ముందుపెట్టి విజయం సాధించడంలో సహకరించాను. ఈ రోజు ఆయన నాకు జ్ఞానాన్ని బోధిస్తానంటున్నారు’’ అని వ్యంగ్యంగా పేర్కొన్నారు.


ఎన్నికల ట్రస్ట్‌ నుంచి భాజపాకు రూ.10 కోట్లు
కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడి

దిల్లీ: ముంబయి కేంద్రంగా పనిచేసే ఏబీ జనరల్‌ ఎన్నికల ట్రస్ట్‌  2021-22 ఆర్థిక సంవత్సరంలో భాజపాకు రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం తెలిపింది. ఈ ట్రస్టుకు హిందాల్కో ఇండస్ట్రీస్‌ నుంచి రూ.5 కోట్ల చొప్పున రెండు విడతల్లో రూ.10 కోట్లు విరాళంగా అందింది. ఆ మొత్తాన్ని ఏబీ జనరల్‌ (రూ.5 కోట్ల చొప్పున రెండు సార్లు) భాజపాకు విరాళంగా ఇచ్చింది.  

చెన్నై కేంద్రంగా పనిచేసే ట్రయాంఫ్‌ ఎన్నికల ట్రస్ట్‌కు రూ.50 లక్షల మొత్తం ట్యూబ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరంలో విరాళంగా అందింది. ఈ మొత్తాన్ని ద్రవిడ మున్నేట్ర కజగమ్‌కు ‘ట్రయాంఫ్‌’ విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు రెండు సంస్థలు తమ వార్షిక చందా నివేదికలను ఎన్నికల సంఘానికి సమర్పించగా, వాటిని పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచారు. ఎన్నికల ట్రస్ట్‌లు వ్యక్తులు, కంపెనీల నుంచి విరాళాలు స్వీకరించి, వాటిని రాజకీయ పార్టీలకు పంచే స్వచ్ఛంద సంస్థలు. ఈ ట్రస్టులకు ఆదాయపుపన్ను మినహాయింపు ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని