ఆఫ్తాబ్‌ నార్కో టెస్టుకు కోర్టు అనుమతి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్‌ హత్య కేసు దర్యాప్తులో మరో ముందడుగు పడింది.

Published : 30 Nov 2022 04:59 IST

డీఎన్‌ఏ నివేదిక ఆలస్యంపై అనుమానాలు

దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్‌ హత్య కేసు దర్యాప్తులో మరో ముందడుగు పడింది. నిందితుడు ఆఫ్తాబ్‌ ఆమిన్‌ పూనావాలాకు నార్కోటెస్ట్‌ నిర్వహించాలంటూ పోలీసులు చేసిన అభ్యర్థనను దిల్లీ కోర్టు అంగీకరించింది. డిసెంబర్‌ 1, 5 తేదీల్లో రోహిణిలోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌లో పరీక్ష నిర్వహించాలని కోర్టు సూచించినట్లు ఆఫ్తాబ్‌ తరఫు న్యాయవాది తెలిపారు. ఈ కేసులో నిందితుడు ఆఫ్తాబ్‌ పూనావాలను అరెస్టు చేసి రెండు వారాలకు పైనే అయ్యింది. నిందితుడు చెప్పిన వివరాల మేరకు శ్రద్ధావిగా భావిస్తున్న కొన్ని శరీర భాగాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అవి మృతురాలివేనా? అని చెప్పేందుకు మాత్రం ఇంతవరకూ ఎలాంటి ఆధారాల్లేవు. దీన్ని తేల్చేందుకు చేపట్టిన డీఎన్‌ఏ పరీక్షల నివేదిక ఇంతవరకూ రాకపోవడంపై ఫోరెన్సిక్‌ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే సిబ్బంది కొరత కారణంగానే జాప్యం జరుగుతోందని అధికారులు చెబుతుండటం గమనార్హం.

నిందితుడికి భారీ భద్రత..

ఫోరెన్సిక్‌ పరీక్షల అనంతరం ఆఫ్తాబ్‌ను ల్యాబ్‌ నుంచి జైలుకు తరలిస్తుండగా  సోమవారం కొందరు వ్యక్తులు కత్తులతో పోలీసు వ్యాన్‌పై దాడి చేశారు. దీంతో భారీ భద్రత మధ్య మంగళవారం ఉదయం మిగతా ఫోరెన్సిక్‌ పరీక్షల కోసం ఆఫ్తాబ్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్‌ రోహిణి ల్యాబ్‌కు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని