ఏకత్వాన్ని ప్రోత్సహించేందుకు కృషి

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన కూటముల్లో ఒకటైన జీ-20 అధ్యక్ష బాధ్యతలను మనదేశం గురువారం అధికారికంగా చేపట్టింది.

Published : 02 Dec 2022 03:40 IST

జీ-20 అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ

దిల్లీ: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన కూటముల్లో ఒకటైన జీ-20 అధ్యక్ష బాధ్యతలను మనదేశం గురువారం అధికారికంగా చేపట్టింది. ఈ నేపథ్యంలో మానవాళి మొత్తానికి ప్రయోజనం కోసం ‘ప్రాథమిక ఆలోచనా ధోరణిలో మార్పు’ అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అలాగే ఇది యుద్ధాల శకం కాదన్నారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే ఇతివృత్తం ప్రేరణతో ఏకత్వాన్ని ప్రోత్సహించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. తద్వారా ఉగ్రవాదం, వాతావరణ మార్పు, మహమ్మారులు వంటి భారీ సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవచ్చన్నారు. ఈ క్రమంలో మోదీ వరుస ట్వీట్లు చేస్తూ.. భారత్‌ జీ-20 ఎజెండా ప్రతిష్ఠాత్మకంగా, కార్యాచరణ ఆధారితంగా, నిర్ణయాత్మకంగా ఉంటుందని తెలిపారు. భారత్‌ అధ్యక్ష హోదాను వైద్యం, సామరస్యం, ఆశల అధ్యక్షతగా మార్చేందుకు కలిసి పనిచేద్దామన్నారు. మానవ-కేంద్రీకృతంగా ప్రపంచీకరణకు కొత్త నమూనా రూపొందించడానికి కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. గత నెలలో ఇండోనేసియాలోని బాలిలో జరిగిన జీ-20 కూటమి రెండు రోజుల సదస్సు ముగింపు సందర్భంగా ఆ దేశం నుంచి భారత్‌ అధ్యక్ష బాధ్యతలను లాంఛనంగా స్వీకరించింది.

ప్రతినిధులందరికీ ఆహ్వానం: రాష్ట్రపతి

వసుధైక కుటుంబం ఇతివృత్తంగా జీ-20 అధ్యక్ష పదవిలో విజయవంతం కావాలంటూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ‘టీంఇండియా’కు శుభాభినందనలు తెలిపారు. ‘‘ఇండియా జీ-20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. ఈ సందర్భంగా వసుధైక కుటుంబం ఇతివృత్తంగా అధ్యక్ష స్థానంలో విజయవంతం కావాలంటూ టీంఇండియాకు నేను శుభాభినందనలు తెలుపుతున్నాను. అతిథి దేవో భవ అనే గౌరవ సంప్రదాయంలో భాగంగా ప్రతినిధులందరికీ నేను ఆహ్వానం పలుకుతున్నాను’’ అని ముర్ము ట్వీట్‌ చేశారు.

* జీ-20 బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో దేశంలోని భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలోని తాజ్‌మహల్‌, ఆగ్రాకోట వంటి 100 కట్టడాలను విద్యుత్‌ దీపాలతో సుందరంగా అలంకరించారు. ఈ నెల 1 నుంచి 7వ తేదీ వరకూ ఈ వెలుగులు కనువిందు చేయనున్నాయి.

అమెరికా, ఫ్రాన్స్‌ మద్దతు..

జీ20 అధ్యక్ష పదవిని భారత్‌ అధికారికంగా చేపట్టిన సందర్భంగా  పలు దేశాలు భారత్‌కు అభినందనలు తెలిపాయి. ఈ క్రమంలో అమెరికాతో పాటు ఫ్రాన్స్‌ తమ మద్దతును తెలియజేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని