Wi-Fi facility in Trains: రైలు బోగీల్లోనూ వైఫై సదుపాయం కోరతా: సీఎం ప్రమోద్‌ సావంత్‌

రైలులో ప్రయాణించిన గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌(Pramod sawant) కొన్ని సమస్యలను గుర్తించానన్నారు. వీటిలో ప్రధానమైనది రైలు బోగీల్లో వైఫై సర్వీసులు లేకపోవడమేనని.. దీనిపై రైల్వే మంత్రికి లేఖరాస్తానని వెల్లడించారు.

Published : 10 Feb 2023 01:33 IST

పనాజీ: ప్రస్తుతం దేశంలోని అనేక రైల్వే స్టేషన్లలో వైఫై సేవలు(Wi-Fi services) అందుబాటులో ఉండగా.. రైలు బోగీల్లోనూ ఈ సదుపాయం కల్పించాలని కోరనున్నట్టు గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌(Pramod sawant) తెలిపారు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌(Ashwini Vaishnaw)కు లేఖ రాయనున్నట్టు వెల్లడించారు. కర్ణాటకలోని మంగళూరులో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం.. గురువారం అక్కడి నుంచి గోవాకు నేత్రావతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ విలేకర్లతో మాట్లాడారు. తన రైలు ప్రయాణంలో కొన్ని సమస్యలు గుర్తించానన్నారు. వీటిలో ముఖ్యమైంది.. రైలు కోచ్‌లలో వైఫై కనెక్టివిటీయేనన్నారు. రైలు బోగీల్లో వైఫై కనెక్టివిటీ అందుబాటులోకి తేవాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రికి లేఖ రాస్తాననన్నారు. గోవా, మంగళూరు మధ్య కనెక్టివిటీని పెంచాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్న ఆయన.. ముంబయి నుంచి మంగళూరు వరకు ఏర్పాటు చేసే వందే భారత్‌ రైలును గోవా వరకు పొడిగించాలని కోరారు. మంగళూరు, గోవాలోని మోపాలో ఉన్న మనోహర్‌ పారికర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం మధ్య ఎయిర్‌ కనెక్టివిటీని ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య అనుసంధానం పర్యాటకం, వాణిజ్య రంగాలకు ఎంతో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని