Manohar Lal Khattar: సాధారణ వ్యక్తిలా మారువేషంలో పర్యటించిన సీఎం

సీఎం పర్యటన అనగానే భద్రతాపరమై ఏర్పాట్ల గురించి చెప్పాల్సిన అవసరంలేదు. ఆయన వచ్చి వెళ్లేంత వరకు ఆ ప్రాంతంలో అధికారుల హడావుడి ఉంటుంది. కానీ, దీనికి భిన్నంగా సామాన్యుడిలా ప్రజల మధ్యలో తిరిగారు హరియాణా సీఎం. 

Published : 08 Nov 2023 16:52 IST

పంచకుల: పూర్వం రోజుల్లో ప్రజల సమస్యలు, తమ పరిపాలన గురించి తెలుసుకునేందుకు రాజులు మారువేషాల్లో పర్యటించేవారు. కానీ, ప్రస్తుతం భద్రతాపరమైన కారణాలతో సెక్యూరిటీ లేకుండా బయటకు రావడంలేదు. ఇక ముఖ్యమంత్రి పర్యటనకు వస్తున్నారంటే.. ప్రభుత్వాధికారుల హడావుడి, పార్టీ శ్రేణుల ఏర్పాట్లు, పోలీసుల తనిఖీలు గురించి చెప్పక్కర్లేదు. ఆ ప్రాంతంలో ప్రతి వ్యక్తి కదలికను నిఘా నేత్రాలు గమనిస్తూ ఉంటాయి. అయితే, ఇలాంటి ఏర్పాట్లేవీ లేకుండా.. సాధారణ వ్యక్తిలా సీఎం జనం మధ్యలోకి వెళితే ఎలా ఉంటుంది? ఆయన భద్రతకు ప్రమాదం కదా? అనే సందేహం కలగకమానదు. కానీ, ఇందుకు భిన్నంగా హరియాణా (Harayana) సీఎం మనోహర్ లాల్‌ ఖట్టర్‌ (Manohar Lal Khattar) మారువేషంలో జనం మధ్యలోకి వచ్చారు. తమ పక్కనుంచి వెళుతున్నా.. ఆయన్ను ఎవరూ గుర్తుపట్టలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

హరియాణాలోని పంచకులలో సెక్టార్‌-5లో ఉన్న ఓ గ్రౌండ్‌లో జరుగుతున్న మేళాలో మంగళవారం సాయంత్రం సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌.. సాధారణ వ్యక్తిలా కాసేపు ప్రజల మధ్యలో తిరిగారు. టోపీ పెట్టుకుని, మాస్క్‌ ధరించి.. ముఖానికి తువాలు చుట్టుకుని మేళా జరుగుతున్న ప్రదేశంలో ఫోన్‌ చూసుకుంటూ నిలబడ్డారు. అనంతరం తినుబండారాలు కొనుగోలు చేసి ఆ ప్రాంతమంతా కలియ తిరిగారు. మేళాలో ఆయన పర్యటిస్తున్నంతసేపు చుట్టూ భద్రతా సిబ్బంది లేరు. సాధారణ వ్యక్తిలా జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళుతుండటం వీడియోలో చూడొచ్చు. అయితే, ఆయన ఎందుకోసం సాధారణ వ్యక్తిలా జనం మధ్యలో పర్యటించారనే దానిపై స్పష్టతలేదు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని