Published : 11 Sep 2021 22:29 IST

Haryana: శాంతించిన కర్నాల్‌.. ధర్నాను విరమించుకున్న రైతులు

కర్నాల్‌: తమపై లాఠీఛార్జ్‌ చేయించిన ఐఏఎస్‌ అధికారిపై చర్యలు తీసుకోవాలని హరియాణా రైతులు చేస్తున్న డిమాండ్లపై ప్రతిష్టంభన తొలగింది. నాలుగో విడత చర్చల సందర్భంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల డిమాండ్లను అంగీకరించడంతో కర్నాల్‌లో చేపట్టిన ధర్నాను రైతులు విరమించుకున్నారు. ఆగస్టు 28న జరిగిన కర్నాల్ లాఠీఛార్జ్‌ ఘటనలో ఐఏఎస్ అధికారి ఆయుష్ సిన్హా పాత్రపై విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన విచారణ కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం రైతు సంఘాల నాయకులకు తెలిపింది. విచారణ పూర్తయ్యే వరకు సిన్హా విధులకు హాజరు కావొద్దని పేర్కొంటూ సెలవుపై పంపింది. లాఠీఛార్జ్‌ ఘటనలో చనిపోయిన సుశీల్‌ కాజల్‌ కుటుంబాన్ని ఆదుకోవాలని రైతులు డిమాండ్‌ చేసిన నేపథ్యంలో అతడి కుటుంబంలోని ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

సమావేశం ముగిసిన అనంతరం సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి దేవేందర్‌ సింగ్‌, రైతు నాయకుడు గురునామ్‌ సింగ్‌ చాదునీ కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కర్నాల్‌లో చేపట్టిన ధర్నాను విరమిస్తున్నట్లు ప్రకటించారు. ‘‘లాఠీఛార్జ్‌ ఘటనకు కారణమైన ఐఏఎస్‌ అధికారిపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ద్వారా విచారణ చేయించాలనే మా డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది’’ అని చాదునీ తెలిపారు. ‘‘రైతులు మా సోదరులు. వారి డిమాండ్లను పరిష్కారించడానికి అన్ని విధాల కృషి చేస్తాం’’ అని ఐఏఎస్‌ అధికారి దేవేందర్‌ సింగ్‌ పేర్కొన్నారు.

ఇదీ నేపథ్యం..

ఆగస్టు 28న హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ఓ సమావేశంలో పాల్గొనడానికి కర్నాల్‌ వెళ్లారు. తమ సమస్యలు పరిష్కరించమంటూ, కేంద్రప్రభుత్వం చేసిన కొత్త రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆ ప్రాంత రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. ఈ సంఘటనలో ఇద్దరు రైతులు మరణించగా, కొందరు గాయపడ్డారు. అదే సమయంలో కర్నాల్‌ సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌గా ఉన్న ఆయుష్‌ సిన్హా ఆగ్రహంతో ఊగిపోయారు. ‘వాళ్ల తలలు పగలగొట్టండి’ అంటూ రైతులనుద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు ఆజ్ఞలు జారీ చేశారు. ఇదంతా కెమెరాల్లో రికార్డైంది. వీడియో బయటికి రావడంతో సిన్హాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కీలక స్థానంలో ఉన్న అధికారి సంయమనం కోల్పోయి అలా మాట్లాడటం ఏంటని అంతా విరుచుకుపడ్డారు. కలెక్టర్‌ వ్యాఖ్యలు వైరల్‌ కావడంతో రైతులు అతడ్ని ఉద్యోగం నుంచి తొలగించాలంటూ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. నెలరోజులు గడిచినా వాళ్లు వెనక్కి తగ్గలేదు. కలెక్టర్‌ను డిస్మిస్‌ చేయకపోతే సింఘు, టిక్రీ సరిహద్దుల్లో నిరవధిక రాస్తారోకో, ధర్నా కార్యక్రమాలు చేపడతామని రైతు ఉద్యమ నేత నేత రాకేష్‌ టికాయిత్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. తాత్కాలికంగా అతడిని విధుల నుంచి తప్పించాల్సి వచ్చింది. అయితే, ఈ సంఘటనలో తమ రాజకీయాల కోసం ఆయనను బలిపశువును చేశారని కొందరు నెటిజన్లు అంతర్జాలంలో వాపోతున్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని