Delhi Rains: ఫ్లైఓవర్‌ పైనుంచి జలపాతం.. దిల్లీలో ‘నయాగరా’..!

దేశ రాజధాని దిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి

Published : 01 Sep 2021 13:08 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. గత 24 గంటల్లో దిల్లీలో రికార్డు స్థాయిలో 112.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.

ఇదిలా ఉండగా.. దిల్లీ వర్షాలకు సంబంధించి ఒక వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. వికాస్‌పురి ప్రాంతంలో ఓ ఫ్లైఓవర్‌ వరదనీటితో నిండిపోవడంతో ఆ వంతెనపై నుంచి నీరు కింద ఉన్న రోడ్డుపై పడింది. ఇది అచ్చంగా జలపాతంలా కన్పించింది. దీంతో ఈ వీడియోను పలువురు నెటిజన్లు సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తూ ‘దిల్లీకి నయాగరా వచ్చింది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.

మరోవైపు రానున్న రోజుల్లోనూ దిల్లీలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. రానున్న గంటల్లో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది. దిల్లీ వ్యాప్తంగా ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని