ketharnath: కేదార్‌నాథ్‌ ‘బంగారు తాపడం’పై ప్రత్యేక కమిటీ

కేదార్‌నాథ్‌ గర్భగుడికి బంగారు తాపడంపై కుంభకోణం జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.

Updated : 24 Jun 2023 21:03 IST

దెహ్రాదూన్‌: ఇటీవల కేదార్‌నాథ్‌ ఆలయానికి చెందిన పూజారి బంగారు తాపడం చేసే ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, రూ.125 కోట్లు కుంభకోణం జరిగిందని సోషల్‌ మీడియాలో విమర్శలు చేయడం సంచలనం సృష్టించింది. దీనిపై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి సత్పాల్‌ మహరాజ్‌  మాట్లాడుతూ.. విచారణ కమిటీలో సాంకేతిక నిపుణులతో పాటు స్వర్ణకారులను కూడా చేర్చాలని మత వ్యవహారాల కార్యదర్శి హరిశ్చంద్ర సెమ్వాల్‌ను కోరారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా నిష్పక్షపాతంగా ఉందని దోషులను కఠినంగా శిక్షిస్తామని ఆయన పేర్కొన్నారు.

శ్రీ బద్రీనాథ్‌ - కేథర్‌నాథ్‌ ఆలయ కమిటీ చట్టం 1939 ప్రకారం విరాళాలు అంగీకరించవచ్చు.  గర్భగుడిలో బంగారు పూత పూయడం కోసం దాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.  అలాగే భారత పురావస్తు శాఖ నిపుణుల ఆధ్వర్యంలోనే పనులన్నీ జరిగాయని ఆయన తెలిపారు. ఇందులో ఆలయ కమిటీ ఎటువంటి జోక్యం చేసుకోలేదని పేర్కొన్నారు. పని పూర్తయిన తర్వాత సంబంధిత పత్రాలను ఆలయ కమిటీకి సమర్పించారని మంత్రి తెలిపారు. చార్‌ధామ్‌  యాత్రకు ఆటంకం కలిగించాలనే విపక్షాలు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు.  ఆలయ గర్భగుడిలో 23,777.800 గ్రాముల బంగారాన్ని ఉపయోగించినట్లు ఆలయ కమిటీ  గతంలో ప్రకటించింది. దీని ప్రస్తుత విలువ రూ.14.38 కోట్లు. పూత పూసిన రాగి పలకల మొత్తం బరువు 1,001.300 కిలోలు కాగా దీని విలువ రూ.29 లక్షలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు