Higher Pension From EPFO: అధిక పింఛనులో కోత!

అధిక పింఛను ఆశావహులను ఈపీఎఫ్‌వో ఆందోళనలోకి నెట్టేస్తోంది. ఇప్పటికే లెక్కింపు సూత్రాన్ని ప్రకటించగా తాజాగా పార్టు-1, పార్టు-2 విధానాన్ని తెరపైకి తెచ్చింది.

Updated : 19 Aug 2023 09:17 IST

30 శాతానికి పైగా తగ్గే అవకాశం
తెరపైకి పార్టు-1, పార్టు-2 గణన విధానం
రవుర్కెలా డిమాండ్‌ నోటీసుల్లో బహిర్గతం
ఈనాడు - హైదరాబాద్‌

అధిక పింఛను ఆశావహులను ఈపీఎఫ్‌వో ఆందోళనలోకి నెట్టేస్తోంది. ఇప్పటికే లెక్కింపు సూత్రాన్ని ప్రకటించగా తాజాగా పార్టు-1, పార్టు-2 విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఒడిశాలోని రవుర్కెలా ఈపీఎఫ్‌వో ప్రాంతీయ కార్యాలయం తమ ప్రాంత పరిధిలోని చందాదారులు, పింఛనుదారులకు పంపుతున్న డిమాండ్‌ నోటీసుల్లో ఇది బయటపడింది. ఈ విధానంతో వాస్తవిక పింఛనులో 30 శాతం పైగానే కోతపడనుంది. ఇది సరికాదని, ఆశావహులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చట్టబద్ధంగా వాస్తవిక పింఛను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈపీఎఫ్‌వో కేంద్ర కార్యాలయం నుంచి మాత్రం ఇప్పటిదాకా ఏ స్పష్టతా లేదు.

ఇప్పటిదాకా లెక్కింపు ఫార్ములా ఇదీ

అధిక పింఛను లెక్కింపు ఫార్ములాపై ఈపీఎఫ్‌వో 2023 జూన్‌ 1న స్పష్టత ఇచ్చింది. 2014 సెప్టెంబరు 1 నాటికి రిటైరైన వారికి చివరి ఏడాది వేతన సగటు ఆధారంగా లెక్కించాలని సూచించింది. అలాగే 2014 సెప్టెంబరు 1 తరువాత పదవీ విరమణ చేసే వారికి చివరి 60 నెలల సగటు వేతనం ఆధారంగా లెక్కించాలని తెలిపింది.

రవుర్కెలా కార్యాలయ డిమాండ్‌ నోటీసుల్లో ఏముందంటే..

అధిక పింఛను ఏవిధంగా ఖరారు చేస్తున్నదీ ఒడిశాలోని రవుర్కెలా ఈపీఎఫ్‌వో ప్రాంతీయ కార్యాలయం వెల్లడించింది. ఈ పథకానికి అర్హులైన ఉద్యోగులు/పింఛనుదారులు కట్టాల్సిన మొత్తానికి సంబంధించి జారీ చేసిన డిమాండ్‌ నోటీసుల్లో పార్టుల లెక్కింపు విధానంపై వివరణ ఇచ్చింది. ఉద్యోగి సర్వీసు కాలం ఆధారంగా రెండు పార్టులుగా పింఛను లెక్కిస్తామని పేర్కొంది. 1995 నవంబరు 16 నుంచి 2014 ఆగస్టు 31 వరకు చేసిన సర్వీసుకు చివరి ఏడాది వేతన సగటు తీసుకుని పార్ట్‌-1 కింద; 2014 సెప్టెంబరు 1 నుంచి పదవీ విరమణ చేసిన నాటివరకు చివరి ఐదేళ్ల వేతన సగటు తీసుకుని పార్ట్‌-2 కింద గణించి పార్ట్‌-1, పార్ట్‌-2 కలిపి తుది పింఛను ఖరారు చేస్తున్నట్టు తెలిపింది.

ఇదీ నష్టం...!

ఉదాహరణకు ఒక ఉద్యోగి ఓ ప్రైవేటు సంస్థలో 1998 నుంచి 2023 వరకు 25 ఏళ్లు పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆ ఉద్యోగి చివరి ఐదేళ్ల వేతన సగటు (మూలవేతనం, డీఏ కలిపి) రూ.50,000గా ఉంది. 2023 జూన్‌ 1 నాటి ఆదేశాల ప్రకారం అతనికి నెలకు రూ.17,857 పింఛను రావాలి.

పార్టు-1, పార్టు-2గా విభజించి లెక్కిస్తే...

ఆ ఉద్యోగికి 2014 సెప్టెంబరు 1 నాటికి చివరి ఏడాది వేతన సగటు రూ.28 వేలు అనుకుందాం. అప్పుడు అతని సర్వీసుకాలం 17ఏళ్లు... ఈ లెక్కన పార్టు-1 కింద పింఛను రూ.6,800 అవుతుంది. 2023 నాటికి మిగతా ఎనిమిదేళ్ల సర్వీసుకు ఐదేళ్ల వేతన సగటు తీసుకుంటే పార్టు-2 కింద పింఛను రూ.5,714 అవుతుంది. ఈ లెక్కన పార్టు-1, పార్టు-2 కలిపి తుది పింఛను రూ.12,514 అవుతుంది. అంటే ఒకేసారి రూ.5,073 తగ్గుతుంది.
ఇదీ పింఛను లెక్కింపు ఫార్ములా = (వేతన సగటు x సర్వీసు)/70

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని