Amit Shah: అమిత్ షా బెంగాల్‌ పర్యటన వేళ కలకలం.. కారులో 3400 డిటోనేటర్లు..!

కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit shah) నేడు పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్నారు. ఈ సమయంలో బీర్‌భూమ్‌ జిల్లాలో భారీగా పేలుడు పదార్థాలను అధికారులు గుర్తించారు.

Updated : 14 Apr 2023 18:48 IST

కోల్‌కతా: కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit shah) పర్యటన వేళ.. పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమవడం కలకలం రేపుతోంది. బీర్‌భూమ్‌ జిల్లాలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఓ కారులో 3400 డిటోనేటర్లను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit shah) శుక్రవారం బీర్‌భూమ్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఈ జిల్లాలోని గుస్లారా బైపాస్‌ సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఓ స్కార్పియో కారు అనుమానాస్పదంగా కన్పించింది. బుధవారం నుంచి ఆ వాహనం అక్కడే ఉండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కారును తనిఖీ చేయగా.. అందులో 17 బాక్సులు ఉన్నాయి. వాటిని తెరిచి చూడగా ఒక్కో బాక్సులో 200 వరకు జిలెటిన్‌ స్టిక్స్‌ (gelatin sticks) ఉన్నాయి. దీంతో పోలీసులు వెంటనే బాంబు స్క్వాడ్‌ను పిలిపించి పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేశారు. అనంతరం కారును స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అమిత్ షా పర్యటనకు ఒక రోజు ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.

గతేడాది జులైలోనూ బీర్‌భూమ్‌ (Birbhum) జిల్లాలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. ఓ పిక్‌అప్‌ వ్యాన్‌లో 81వేల డిటోనేటర్లను గుర్తించిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. భారీ పేలుళ్లకు వారు చేసిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ కేసును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించింది. ఆ దర్యాప్తు కొనసాగుతుండగా.. తాజాగా ఇదే ప్రాంతంలో మరోసారి పేలుడు పదార్థాలు లభ్యమవడంతో ఎన్‌ఐఏ దీనిపై దృష్టి సారించింది.

35+ లోక్‌సభ సీట్లలో మమ్మల్ని  గెలిపిస్తే.. 2025లోనే దీదీ ఇంటికి!

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) పశ్చిమబెంగాల్‌(West Bengal)లో 42 లోక్‌సభ సీట్లకు గానూ 35కు పైగా సీట్లలో భాజపాను గెలిపించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా(Amit shah) విజ్ఞప్తి చేశారు.  ఈ లక్ష్యాన్ని తాము సాధిస్తే.. 2025 తర్వాత తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తి కాలం మనుగడ సాగించదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీదీ సర్కార్‌కు  ఇంకా 2026 మే వరకు గడువు ఉన్న నేపథ్యంలో బీర్బుమ్‌ జిల్లా పర్యటనలో అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.  ఇటీవల రాష్ట్రంలోని పలుచోట్ల శ్రీరామ నవమి ర్యాలీల్లో తలెత్తిన ఘర్షణల అంశాన్ని ప్రస్తావించిన అమిత్‌ షా.. మమతా బెనర్జీ హిట్లర్‌ తరహా పాలనను నడుపుతున్నారంటూ విమర్శలు గుప్పించారు.  బెంగాల్‌లో 35 సీట్లకు పైగా సాధించి కేంద్రంలో తాము మళ్లీ అధికారంలోకి వస్తే శ్రీరామనవమి ర్యాలీలపై దాడి చేయడానికి ఎవరూ సాహసం చేయరన్నారు. 

ప్రస్తుతం ఎంపీగా, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న తన మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీని సీఎంని చేయాలని మమతా బెనర్జీ కలలు కంటున్నారని అమిత్‌ షా అన్నారు. కానీ, బెంగాల్‌తో తదుపరి సీఎం భాజపా నుంచే అవుతారని వ్యాఖ్యానించారు. అవినీతి తృణమూల్‌ కాంగ్రెస్‌పై పోరాడేది, ఓడించేది ఒక్క భాజపా మాత్రమేనన్నారు.  2019 లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో భాజపా 18 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.  మరోవైపు, అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై తృణమూల్‌ కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. ఆయన వ్యాఖ్యలు అప్రజాస్వామికం, రాజ్యాంగవిరుద్ధమని మండిపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు