Kashmir: స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల వేళ.. భారీ ఉగ్రకుట్ర భగ్నం

స్వాతంత్ర్య వజ్రోత్సవాలను భారత్ (Independence Day) ఘనంగా జరుపుకుంటున్న వేళ ఉగ్రవాదులు కుట్రకు పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది. దీన్ని పసిగట్టిన జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir) పోలీసులు, భద్రతా దళాలు వారిని కుట్రను భగ్నం చేశాయి.

Published : 10 Aug 2022 13:37 IST

పుల్వామా: స్వాతంత్ర్య వజ్రోత్సవాలను భారత్ (Independence Day) ఘనంగా జరుపుకొంటున్న వేళ.. ఉగ్రవాదులు కుట్రకు పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది. దీన్ని పసిగట్టిన జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir) పోలీసులు, భద్రతా దళాలు వారి కుట్రను భగ్నం చేశాయి. పుల్వామాలో (Pulwama) భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను (IED) గుర్తించిన భద్రతా దళాలు.. వాటిని నిర్జీవ ప్రాంతంలో పేల్చివేశాయి. పేలుడు పదార్థాలు దాదాపు 25 నుంచి 30 కిలోల వరకు ఉండొచ్చని జమ్మూ కశ్మీర్‌ పోలీసులు వెల్లడించారు.

‘పుల్వామాలోని తహబ్‌ క్రాసింగ్‌ వద్ద సుమారు 25 నుంచి 30 కిలోల పేలుడు పదార్థాలను భద్రతా దళాలు, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ముందస్తుగా గుర్తించడం వల్ల పెను ప్రమాదాన్ని నివారించగలిగాం’ అని జమ్మూకశ్మీర్‌ ఎడీజీపీ విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. ఉగ్ర కుట్రలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామన్న ఆయన.. జమ్మూ కశ్మీర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు.

ఇదిలా ఉంటే, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకొంటున్న వేళ ఉగ్రదాడులకు ముష్కరులు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఐఎస్ఐఎస్‌ సంస్థతో సంబంధమున్న సాబుద్దీన్‌ అనే వ్యక్తిని ఉగ్రవాద వ్యతిరేక దళం (ATS) ఉత్తర్‌ప్రదేశ్‌లోని అజమ్‌గఢ్‌లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతడిపై ఐపీసీతోపాటు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం, ఆయుధాల చట్టానికి సంబంధించి పలు కేసులు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని