OSCW: బస్సులో మొదటి ప్యాసింజర్‌ ‘మహిళ’.. అపశకునమట!

ప్రభుత్వ, ప్రైవేటు బస్సుల్లో మొదటి ప్యాసింజర్‌గా మహిళలనూ ఎక్కనివ్వాలని ‘ఒడిశా మహిళా కమిషన్‌’.. రాష్ట్ర రవాణాశాఖకు సూచించింది. బస్సులో తొలి ప్రయాణికురాలిగా మహిళ ఎక్కడాన్ని కొంతమంది అపశకునంగా భావిస్తున్నట్లు కమిషన్‌కు అందిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకుంది.

Updated : 28 Jul 2023 18:30 IST

భువనేశ్వర్‌: సమాజం ఎంతగా అభివృద్ధి చెందుతోన్నా.. నేటికీ అక్కడక్కడా మూఢనమ్మకాలు (Superstitions) రాజ్యమేలుతున్నాయి. ఒడిశా (Odisha)లోనూ ఓ అంధవిశ్వాసానికి సంబంధించిన వ్యవహారం చర్చనీయాంశమైంది. మహిళా వివక్షకు సంబంధించిన కేసు కావడంతో.. రాష్ట్ర మహిళా కమిషన్‌ రంగంలోకి దిగి అధికార యంత్రాంగానికి తగు సూచనలు ఇవ్వాల్సి వచ్చింది. భువనేశ్వర్‌ బారాముండా బస్టాండ్‌లోని బస్సులో తొలి ప్రయాణికురాలి (First Passenger)గా ఓ మహిళను ఎక్కనీయకుండా సిబ్బంది అడ్డుకున్నారని ఆరోపిస్తూ సోనేపుర్‌కు చెందిన సామాజిక కార్యకర్త ఘసిరామ్ పాండా.. ‘ఒడిశా మహిళా కమిషన్‌ (OSCW)’కు ఫిర్యాదు చేశారు. బస్సులో మొదటి ప్యాసింజర్‌గా ఒక మహిళ ఎక్కడాన్ని కొంతమంది అపశకునంగా భావిస్తున్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఇండిగోకు రూ.30లక్షల జరిమానా..

దీనిపై కమిషన్‌ విచారణ చేపట్టింది. ‘బస్సులో మహిళ మొదట అడుగుపెడితే.. ఆ రోజు బస్సు ప్రమాదానికి గురవుతుంది. లేదా, ఆదాయం సరిగా రాదనే కొంతమంది మూఢనమ్మకం నుంచి ఈ వివక్షపూరిత, అహేతుక ఆచారం పుట్టుకొచ్చిన’ట్లు గుర్తించింది. ఈ క్రమంలోనే మహిళలను తొలి ప్రయాణికులుగా ఎక్కేందుకు అనుమతించేలా ఆదేశాలు జారీ చేయాలని రవాణాశాఖకు సూచించింది. ‘గతంలోనూ ఈ తరహా ఘటనలు మా దృష్టికి వచ్చాయి. ఇకముందు మహిళా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా, వారి భద్రతను, గౌరవాన్ని కాపాడేందుకుగానూ.. ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు తమ మొదటి ప్యాసింజర్‌గా మహిళలనూ అనుమతించేలా చర్యలు తీసుకోవాలి. సిబ్బందికి ఈ మేరకు అవగాహన కల్పించాలి. అదే విధంగా బస్సుల్లో మహిళల రిజర్వేషన్‌ను 50 శాతానికి పెంచాలి’ అని కమిషన్ సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని