Supreme Court: ‘ఆర్మీ వంటి బలగాల్లో సీనియారిటికీ చాలా ప్రాధాన్యం..’

ఆర్మీ వంటి క్రమశిక్షణ కలిగిన బలగాల్లో సీనియారిటీకి ఎంతో ప్రాధాన్యం ఉంటుందని సుప్రీం కోర్టు పేర్కొంది. ‘సీనియారిటీ’ విషయంలో తలెత్తిన గొడవలో సహోద్యోగిని హత్యచేసిన ఓ ఆర్మీ లాన్స్‌నాయక్‌కు పడిన జీవిత ఖైదును తగ్గిస్తూ ఈ మేరకు వ్యాఖ్యానించింది. 

Published : 28 Jul 2023 22:58 IST

దిల్లీ: భారత సైన్యం (Indian Army) వంటి క్రమశిక్షణ కలిగిన బలగాల్లో సీనియారిటీ (Seniority)కి చాలా ప్రాధాన్యం ఉంటుందని సుప్రీం కోర్టు (Supreme Court) పేర్కొంది. ‘సీనియారిటీ’ విషయంలో తలెత్తిన వివాదంలో ఆర్మీలో సహోద్యోగిని హత్య చేసిన కేసులో ఓ దోషికి పడిన జీవిత ఖైదును తగ్గిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు వ్యాఖ్యానించింది. 2004 డిసెంబరులో సైన్యంలో లాన్స్‌నాయక్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తికి.. అదే ర్యాంకు కలిగిన తోటి వ్యక్తికి ‘సీనియారిటీ’ విషయంలో వివాదం తలెత్తింది. ఈ క్రమంలోనే అతడు సహోద్యోగి వద్ద రైఫిల్‌ లాక్కొని కాల్చిచంపాడు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ కంటోన్మెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో కోర్టు మార్షల్‌ అతడిని దోషిగా తేల్చి.. జీవిత ఖైదు విధించింది. చండీగఢ్‌లోని సాయుధ బలగాల ట్రైబ్యునల్‌ ఈ శిక్షను ధ్రువీకరించింది. పంజాబ్‌- హరియాణా హైకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించింది. ఈ క్రమంలోనే కేసు కాస్త సుప్రీం కోర్టుకు చేరింది.

బస్సులో మొదటి ప్యాసింజర్‌ ‘మహిళ’.. అపశకునమట!

దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓఖా, జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌లతో కూడిన ధర్మాసనం.. అప్పీలుదారుకు విధించిన శిక్షను తొమ్మిదేళ్ల మూడు నెలలకు తగ్గించింది. ‘అప్పీలుదారు క్షణికావేశంలో ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఒకవేళ సహోద్యోగిని ప్రణాళిక ప్రకారం లేదా ఉద్దేశపూర్వకంగా చంపాలనుకుంటే మరిన్ని తూటాలు కాల్చేవాడు. కానీ, ఇక్కడ ఒకటే తూటా పేల్చాడు. పైగా ఆ సమయంలో ఇద్దరు మద్యం మత్తులో ఉన్నారు. ఈ క్రమంలోనే ‘సీనియారిటీ’ విషయంలో గొడవ జరిగింది. ఆర్మీ వంటి క్రమశిక్షణ కలిగిన దళంలో ‘సీనియారిటీ’కి చాలా ప్రాధాన్యం ఉంటుంది. అందువల్ల.. ఈ వివాదంలో అప్పీలుదారు క్షణికావేశంలో నేరానికి పాల్పడే అవకాశాలు ఉన్నాయి’ అని ధర్మాసనం పేర్కొంది. అన్ని సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకుంటే.. అప్పీలుదారు ఇప్పటివరకు అనుభవించిన శిక్ష (తొమ్మిదేళ్ల మూడు నెలలు).. ఈ కేసులో విధించాల్సిన శిక్షకు సరిపోతుందని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని