
China:ఆ వంతెనను ఆక్రమిత ప్రాంతంలో నిర్మిస్తున్నారు..
చైనా వైఖరిని ఖండించిన భారత్
దిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సుపై చైనా ఓ కీలక వంతెనను నిర్మిస్తున్నట్లు ఇటీవల ఉపగ్రహ చిత్రాలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై భారత్ గురువారం తీవ్రంగా స్పందించింది. దాదాపు 60 ఏళ్లుగా చైనా ఆక్రమణలో ఉన్న ప్రాంతంలో దీన్ని నిర్మిస్తున్నట్లు విమర్శించింది. అత్యవసర సమయాల్లో సైనిక బలగాలు, ఆయుధ సామగ్రిని వేగంగా తరలించేందుకు చైనా చేపడుతున్న సరిహద్దు మౌలిక సదుపాయాల కల్పనలో ఇదీ ఓ భాగమేనని పేర్కొంది.
‘పాంగాంగ్ సరస్సుపై చైనా వైపు నుంచి వంతెన నిర్మాణంపై రిపోర్టులు వచ్చిన నేపథ్యంలో.. ఈ పరిణామాలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. దాదాపు 60 ఏళ్లుగా చైనా ఆక్రమణలో ఉన్న ప్రాంతంలో ఈ వంతెనను కడుతున్నారు’ అని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ‘ఇటువంటి ఆక్రమణలను భారత్ ఎన్నడూ అంగీకరించలేదు. ఈ క్రమంలో దేశ భద్రతా ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది’ అని వెల్లడించారు.
అరుణాచల్‌ప్రదేశ్‌లోని 15 ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడాన్ని కూడా బాగ్చి మూర్ఖపు చర్యగా కొట్టిపారేశారు. ‘అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టినట్లు వచ్చిన నివేదికలను చూశాం. ఇటువంటి పనులపై మా అభిప్రాయాలను చైనాకు స్పష్టంగా తెలియజేశాం’ అని చెప్పారు. ఇటువంటి చర్యలకు బదులు.. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) పశ్చిమ సెక్టార్ వెంబడి నెలకొన్న సమస్యల పరిష్కారానికి చైనా మాతో కలిసి పని చేస్తుందని ఆశిస్తున్నామన్నారు. ‘అరుణాచల్‌ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే. ప్రాంతాలకు పేర్లు పెట్టడం అనేది వాస్తవాన్ని మార్చలేదు’ అని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై ఇటీవల స్పందించిన విషయ తెలిసిందే.
ఇవీ చదవండి
Advertisement