Independence Day: ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు కన్నుల పండువగా సాగుతున్నాయి. దిల్లీలో ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోదీ జాతీయ జెండాను ఎగురవేశారు.

Updated : 15 Aug 2023 08:41 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు కన్నుల పండువగా సాగుతున్నాయి. దిల్లీలో ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించిన ప్రధాని.. ఆ తర్వాత ఎర్రకోట వద్దకు చేరుకుని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. భారతీయులకు ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని మోదీ చెప్పారు.

బాపూజీ చూపిన అహింసా మార్గంతో స్వాతంత్ర్యం సాధించామని ప్రధాని గుర్తుచేశారు. ఈ ఏడాది అరవిందుడు, దయానంద సరస్వతి 150వ జయంతిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాణి దుర్గావతి, మహాభక్తురాలు మీరాబాయిని స్మరించుకోవాల్సిన తరుణమిదని చెప్పారు. కొద్దివారాల క్రితం మణిపుర్‌లో జరిగిన హింస అత్యంత బాధాకరమని మోదీ అన్నారు. ఎర్రకోట వద్ద జరుగుతున్న వేడుకలకు పలువురు కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్వాతంత్ర్య వేడుకల నేపథ్యంలో దేశరాజధానిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 

కరోనా తర్వాత మన సామర్థ్యం ప్రపంచానికి తెలిసింది

‘‘భారత్‌లో జీ20 సమావేశాలు దేశ సామర్థ్యం, వైవిధ్యాన్ని ప్రపంచం ముందుంచాయి. జీ20 సమావేశాలు ప్రపంచానికి కొత్త భారతాన్ని పరిచయం చేశాయి. మన ఎగుమతులు కొత్త లక్ష్యాలను చేరుకుంటున్నాయి. కరోనా తర్వాత భారత్‌ సామర్థ్యం ప్రపంచానికి తెలిసింది. కొత్త ప్రపంచంలో మన దేశాన్ని విస్మరించడం ఎవరి తరమూ కాదు. మారుతున్న ప్రపంచంలో భారత్‌ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటుంది. దేశమే ప్రథమమన్న పురోగామి ఆలోచనలతో జాతి ముందడుగు వేస్తోంది. బలమైన ప్రభుత్వాలు ఉన్నప్పుడే సంస్కరణలు సాధ్యం. ప్రతి సంస్కరణా జన క్షేమాన్ని కాంక్షించే జరుగుతున్నాయి. సత్తాచాటు, మార్పు చెందు అన్న పద్ధతిలో దేశం ముందడుగు వేస్తోంది. ప్రతి సంస్కరణలోనూ ఓ పరమార్థం ఉంది. సంస్కరణలకు జల్‌శక్తి శాఖ ఓ ఉదాహరణ. పర్యావరణహితంగా ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తున్నాం. 

అప్పుడు కుంభకోణాలు రాజ్యమేలాయి

2014లో మేం అధికారంలోకి వచ్చేనాటికి కుంభకోణాలు రాజ్యమేలుతున్నాయి. అప్పటికి ఆర్థిక వ్యవస్థ ప్రమాదం అంచున ఉంది. ఆ తర్వాత బలమైన ఆర్థిక విధానాలు, పారదర్శక పాలన దేశానికి కొత్త శక్తినిచ్చాయి. పథకాల్లో ఉన్న అనేక అవకతవకలను కట్టడి చేశాం.. ప్రభుత్వ పథకాల్లోని లోపాలను అరికట్టాం. చిన్నలోపాలు అరికట్టడంతో దేశానికి భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరింది’’అని ప్రధాని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని