Rajnath Singh: గల్వాన్‌ ఘటనతో చైనాకు అది తెలిసొచ్చింది: రాజ్‌నాథ్‌ సింగ్

భారత్‌ అంతర్జాతీయంగా బలపడేందుకు నూతన ఆర్థిక, విదేశాంగ విధానాలు దోహదపడ్డాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. 

Updated : 11 Jan 2024 15:53 IST

లండన్‌: గల్వాన్ లోయలో భారత సైన్యం తెగువ, ధైర్య సాహసాలు చైనా దృక్పథాన్ని పూర్తిగా మార్చేశాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. మనం బలమైన శక్తిగా ఎదుగుతున్నామని, గతంలో మాదిరి కళ్లతో బెదిరించే పరిస్థితులు ఇప్పుడు ఏమాత్రం లేవని తెలిపారు. బ్రిటన్‌ పర్యటనలో భాగంగా లండన్‌లోని ఇండియా హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా చైనా అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ఇటీవల భారత్‌పై ప్రచురించిన కథనాన్ని ఆయన ఉటంకించారు. ఆర్థిక, విదేశాంగ విధానాల్లో చోటు చేసుకొన్న మార్పులు మన దేశం ఎదిగేందుకు దోహదపడ్డాయన్నారు. గ్లోబల్‌ టైమ్స్‌ కథనంతో దీనిని చైనా కూడా అంగీకరించిందని తెలిపారు. ప్రపంచ దేశాలతో స్నేహాన్నే తాము కోరుకుంటున్నామన్నారు. 

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ సమయంలో భారతీయ విద్యార్థులను స్వస్థలాలకు చేర్చేందుకు ప్రధాని మోదీ చేసిన కృషిని రాజ్‌నాథ్‌ సింగ్ పొగిడారు. సంక్షోభ సమయంలో మోదీ ఇరు దేశాల అధ్యక్షులతో జరిపిన చర్చల కారణంగా యుద్ధానికి కొన్ని గంటల విరామం ప్రకటించారని తెలిపారు. ‘ఆపరేషన్ గంగ’ పేరిట సుమారు 80 విమానాల్లో ఉక్రెయిన్‌ నుంచి 22 వేల మంది భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు తెలిపారు. 

రిషి సునాక్‌తో రాజ్‌నాథ్‌ భేటీ

బుధవారం బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌తో రాజ్‌నాథ్‌ సింగ్ భేటీ అయ్యారు. 22 ఏళ్ల తర్వాత ఆ దేశంలో భారత రక్షణ మంత్రి పర్యటించడం విశేషం. దీనిలో భాగంగా బ్రిటన్‌ రక్షణ మంత్రి గ్రాంట్‌ షాప్స్‌తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య రక్షణ రంగంలో సహకారంపై చర్చించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని