IMF: మరో ఐదేళ్లలో ప్రపంచ మూడో ఆర్థికశక్తిగా భారత్‌!: ఐఎంఎఫ్

గత కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోతున్న భారత్‌కు అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్‌) సంస్థ ఓ తీపి కబురు అందించింది. మరో ఐదేళ్లలో భారత్‌ మూడో ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశముందని తెలిపింది.

Published : 17 Oct 2022 01:29 IST

దిల్లీ: మరో ఐదేళ్లలో భారత్‌ మూడో ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశముందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్‌) సంస్థ అంచనా వేసింది. అమెరికా, చైనా తర్వాతి స్థానానికి చేరుకోనుందని తెలిపింది.  రానున్న రెండేళ్లలో జర్మనీ, జపాన్‌ దేశాలను దాటే అవకాశముందని ఐఎంఎఫ్‌కి చెందిన వరల్డ్‌ ఔట్‌లుక్‌ డేటాబేస్‌ పేర్కొంది. ఐదో ఆర్థికశక్తిగా ఉన్న ఇంగ్లాండ్‌ స్థానాన్ని ఈ ఏడాది చివరి నాటికే భర్తీ చేయొచ్చని ఐఎంఎఫ్‌ వెల్లడించింది.

ఐఎంఎఫ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత్‌లో ప్రస్తుతం తలసరి స్థూల జాతీయ ఆదాయం (జీడీపీ) 2,466 అమెరికన్‌ డాలర్లు ఉండగా.. 2027 నాటికి ఈ మొత్తం 3,652 డాలర్లకు చేరే అవకాశముంది. జర్మనీ, జపాన్‌ దేశాలను అధిగమించడానికి భారత్‌కు ఉండే అవకాశాలను పరిశీలించినట్లయితే.. భారత్‌లో ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నప్పటికీ, ఆ రెండు దేశాల తరహాలో మాత్రం లేదని ఐఎంఎఫ్‌ అభిప్రాయపడింది. దాదాపు 550 బిలియన్‌ డాలర్ల విదేశీ మారకపు నిల్వలతో భారత్‌ పటిష్ఠంగానే  ఉందని పేర్కొంది.

తాజాగా 2021-2022 మొదటి త్రైమాసికంలోనే తొలిసారిగా ఇంగ్లాండ్‌ను అధిగమించి ఐదో ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలిచిందని గుర్తు చేసింది. తర్వాతి త్రైమాసికాల్లోనూ ఇది కొనసాగే అవకాముందని పేర్కొంది. 2022లో భారత్‌ జీడీపీ అంచనాలను ఐఎంఎఫ్‌ 6.8 శాతానికి తగ్గించింది. కానీ, జూలైలో 7.4 శాతం, జనవరిలో 8.2శాతం, ఏప్రిల్ 2021-మార్చి 2022 మధ్య భారత్ 8.7 శాతం వృద్ధిని సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని