Covid Cases: భారీగా పెరిగిన కొవిడ్‌ కేసులు.. మళ్లీ 7వేల పైకి!

దేశంలో కొవిడ్‌ కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,240 మందికి వైరస్‌ సోకింది. క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు దాదాపు

Updated : 09 Jun 2022 10:06 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కొన్నాళ్ల నుంచి నిత్యం నాలుగు వేల కొత్త కేసులు మాత్రమే వచ్చాయి. కానీ, ఇప్పుడు ఆ సంఖ్య పెరుగుతోంది. వరుసగా రెండోరోజు 40 శాతం మేర పెరిగాయి. ముందురోజు ఐదువేలకుపైగా వచ్చిన కేసులు.. నేడు 7 వేల మార్కు దాటేశాయి. క్రియాశీల కేసులు 28 వేల నుంచి ఒకేసారి 32 వేలకు ఎగబాకాయి. గురువారం కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 

 బుధవారం 3.40 లక్షల మందికి పైగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. 7,240 మందికి పాజిటివ్‌గా తేలింది. 94 రోజుల తర్వాత మరోసారి 5 వేలకుపైగా కేసులు వెలుగుచూశాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 2.13 శాతానికి చేరింది. మహారాష్ట్రలో 2,701 మంది, కేరళలో 2,271 మంది వైరస్‌ బారినపడ్డారు. మహారాష్ట్రలో జనవరి 25 తర్వాత ఇవే ఒక్కరోజు అత్యధిక కేసులు. అక్కడ 42 శాతం కేసులు ఒక్క ముంబయిలోనే వెలుగు చూశాయి. ఆ రాష్ట్రంలో ఒమిక్రాన్‌ సబ్‌వేరియంట్‌ బీఏ.5 ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. 

* ఇక కొత్త కేసులు పెరుగుదలతో క్రియాశీల కేసులు 32,498కి చేరాయి. దాంతో క్రియాశీల రేటు 0.08 శాతంగా నమోదై ఆందోళన కలిగిస్తోంది. 

* నిన్న 3,591 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ 4.26 కోట్ల మందికిపైగా వైరస్‌ను జయించారు. రికవరీ రేటు 98.71 శాతానికి తగ్గిపోయింది. 24 గంటల వ్యవధిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

* గత ఏడాది ప్రారంభం నుంచి 194.59 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న ఒక్కరోజే 15.43 లక్షల మంది టీకా తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని