India-denmark: రెండు దశాబ్దాల తర్వాత భారత్‌లో డెన్మార్క్‌ యువరాజు

రెండు దశాబ్దాల అనంతరం డెన్మార్క్‌ రాచకుటుంబం భారత పర్యటనకు విచ్చేసింది. ఆ దేశ యువరాజు ఫ్రెడెరిక్‌ ఆండ్రే క్రిస్టియన్‌ దంపతులు, పలువురు మంత్రులు ఆదివారం భారత్‌ చేరుకున్నారు. 

Updated : 26 Feb 2023 16:02 IST

దిల్లీ: డెన్మార్క్‌ యువరాజు ఫ్రెడెరిక్‌ ఆండ్రే హెన్రిక్‌ క్రిస్టియన్‌, యువరాణి మేరీ ఎలిజబెత్‌ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం భారత్‌కు చేరుకున్నారు. నేటి నుంచి మార్చి 2 వరకు వారు భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తారని విదేశాంగ శాఖ వెల్లడించింది. 

ఈ పర్యటన డెన్మార్క్‌-భారత్‌కు మధ్య స్నేహబంధం, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి దోహదపడుతుందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి ట్విటర్‌ వేదికగా తెలిపారు. రెండు దశాబ్దాల తర్వాత తొలిసారి డెన్మార్క్‌ రాచకుటుంబం భారత్‌లో పర్యటిస్తోందని పేర్కొన్నారు. దీనిలో యువరాజు వెంట ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి లార్స్‌ లోకీ రస్‌ముస్సేన్‌, పర్యావరణ శాఖ మంత్రి మాగ్నస్‌ హ్యూనిక్‌, ఇంధన శాఖ మంత్రి లార్స్‌ అగార్డ్‌ కూడా ఉన్నారు.

‘‘ఈ పర్యటనలో వీరు తొలుత ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌తో భేటీ కానున్నారు. ఆ తర్వాత కాన్ఫెడరేషన్‌ ఆఫ్ ఇండియన్‌ ఇండస్ట్రీ నిర్వహించే ‘ఇండియా-డెన్మార్క్‌: పార్టనర్స్‌ ఫర్‌ గ్రీన్‌ అండ్‌ సస్టైనబుల్‌ ప్రోగెస్‌’ కార్యక్రమం ప్రారంభ సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోనూ సమావేశమవుతారు. ఆగ్రా, చెన్నైలో పర్యటించి.. మార్చి 2న తిరిగి డెన్మార్క్‌ బయలుదేరుతారు’’అని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. భారత్‌.. డెన్మార్క్ శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశాలు. అంతర్జాతీయ నిబంధనలను, బహుపాక్షిక సమస్యలపై అభిప్రాయాలు, విలువలను ఒకేలా పంచుకుంటాయని చెప్పారు.

గతేడాది మే నెలలో భారత ప్రధాని నరేంద్ర మోదీ డెన్మార్క్‌లో పర్యటించారు. ఆ దేశ ప్రధానమంత్రి మెట్‌ ఫ్రెడరిక్‌సన్‌తో సమావేశమై ద్వైపాకిక్ష అంశాలపై చర్చించారు. అక్కడి వ్యాపారవేత్తలను కలిసి భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని