USA: ప్రాణాపాయం నుంచి బయటపడిన తెలుగు విద్యార్థిని

అమెరికా(USA)లో పిడుగుపాటుకు గురైన భారతీయ విద్యార్థిని సుశ్రూణ్య కోమా నుంచి బయటికి వచ్చినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్‌ వసతిని తొలగించినట్లు  తెలిపాయి.

Updated : 28 Jul 2023 16:01 IST

హ్యుస్టన్‌: ఉన్నత చదవుల కోసం అమెరికా(USA) వెళ్లి పిడుగుపాటుకు గురైన భారతీయ విద్యార్థిని సుశ్రూణ్య కోడూరు (25) కోమా నుంచి బయటికి వచ్చినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్‌ను తొలగించినట్లు వైద్యులు తెలిపారు. ‘‘గత వారం నుంచి వెంటిలేటర్‌ అవసరం లేకుండా ఆమె శ్వాస తీసుకుంటుంది. నిజంగా అద్భుతం జరిగిందనే చెప్పాలి. ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగవడంతో వెంటిలేటర్‌ సదుపాయాన్ని తొలగించాం. వైద్యుల బృందం నిరంతరం సుశ్రూణ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు’’ అని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సుశ్రూణ్య కుటుంబ సభ్యులకు వీసా లభించిందని, వచ్చే వారం వారు హైదరాబాద్‌ నుంచి అమెరికాకు చేరుకుంటారని ఆమె బంధువు సురేంద్రకుమార్‌ తెలిపారు.

స్టూడెంట్ ఎక్సేంజ్‌ ప్రోగామ్‌లో భాగంగా సుశ్రూణ్య యూనివర్సిటీ ఆఫ్‌ హ్యూస్టన్‌ (UH)లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మాస్టర్స్‌ చదువుతోంది. జులై మొదటివారంలో తన స్నేహితులతో కలిసి స్థానిక పార్కులో నడుచుకుంటూ వెళుతున్న సమయంలో ఆమె పిడుగుపాటుకు గురై పక్కనే ఉన్న కొలనులో పడిపోయింది. ఆ సమయంలో 20 నిమిషాలపాటు గుండె లయ తప్పడంతో మెదడు దెబ్బతిని.. కోమాలోకి వెళ్లిపోయింది. ఆమెకు సుదీర్ఘకాలం వైద్యం అందించాలని ఆస్పత్రి వర్గాలు తెలపడంతో ఆర్థిక సహాయం కోసం ఆన్‌లైన్‌లో ‘గోఫండ్‌మీ’ని ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని