Tiger: దేశంలో పులుల సంఖ్య 3,167.. ప్రాజెక్ట్‌ టైగర్‌ స్వర్ణోత్సవంలో మోదీ

ప్రాజెక్ట్‌ టైగర్‌ (Project Tiger) స్వర్ణోత్సవం సందర్భంగా కర్ణాటకలోని మైసూరులో జరిగిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. అఖిల భారత పులుల అంచనా నివేదికను విడుదల చేశారు.

Published : 09 Apr 2023 15:09 IST

మైసూరు: భారత్‌ కేవలం పులులను సంరక్షించడమే కాకుండా.. వాటి సంఖ్య వృద్ధి చెందడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రాజెక్ట్‌ టైగర్‌ (Project Tiger) విజయవంతం కావడం కేవలం భారతదేశానికేకాక.. యావత్‌ ప్రపంచానికి గర్వకారణమని అన్నారు. ప్రాజెక్ట్‌ టైగర్‌ (Project Tiger) స్వర్ణోత్సవాల సందర్భంగా కర్ణాటకలోని మైసూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రధాని ప్రసంగించారు.

ఈ సందర్భంగా ‘అంతర్జాతీయ వ్యాఘ్ర కూటమి (International Big Cats Alliance- IBCA)’ని మోదీ ప్రారంభించారు. ఈ ఐబీసీఏ ప్రపంచవ్యాప్తంగా ఏడు రకాల వ్యాఘ్యాల సంరక్షణకు కృషి చేయనుందని తెలిపారు. అఖిల భారత పులుల అంచనా నివేదికను సైతం విడుదల చేశారు. పులుల సంరక్షణ కార్యక్రమం విజయానికి చిహ్నంగా రూ.50 స్మారక నాణేన్ని ఆవిష్కరించారు. ‘అమృత్‌ కాల్‌’లో పులుల సంరక్షణకు సంబంధించిన ప్రణాళికను కూడా ఈ సందర్భంగా మోదీ విడుదల చేశారు. ప్రకృతిని రక్షించడం భారత సంస్కృతిలో భాగమని తెలిపారు. ప్రపంచంలోని మొత్తం పులలు జనాభాలో 75 శాతం భారత్‌లోనే ఉందని పేర్కొన్నారు.
(ఇదీ చదవండి: పులుల రక్షణలో ప్రాజెక్ట్‌ టైగర్‌)

ప్రపంచ భూభాగంలో భారత్‌ వాటా 2.4 శాతమని మోదీ గుర్తుచేశారు. కానీ, ప్రపంచ జీవవైవిధ్యంలో ఎనిమిది శాతం వాటా భారతదేశానిదని తెలిపారు. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల చిరుతపులులను భారత్‌కు తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రధాని గుర్తుచేశారు. దాదాపు 30,000 ఏనుగులతో ప్రపంచంలోనే అత్యధిక ఆసియా ఏనుగులు ఉన్న దేశంగా భారత్‌ నిలిచిందని తెలిపారు.

దేశంలో 2022 నాటికి మొత్తం 3,167 పులులు ఉన్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. తాజాగా మోదీ విడుదల చేసిన నివేదిక ప్రకారం పులుల సంఖ్య 2006లో 1,411; 2010లో 1,706; 2014లో 2,226; 2018లో 2,967; 2022లో 3,167కు చేరాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు