Kapil Sibal: కేజ్రీవాల్‌పై చర్యలు.. సిబల్ ముందే ఊహించారు..!

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)కు రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ మద్దతు పలికారు. ఆయనకు సీబీఐ సమన్లు జారీ చేయడాన్ని తప్పుపట్టారు. 

Published : 15 Apr 2023 18:45 IST

దిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)కు సీబీఐ సమన్లు జారీ చేయడంపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్(Kapil Sibal) స్పందించారు. ఈ చర్యలను తాను ముందే ఊహించిన విషయాన్ని గుర్తుచేశారు. అధికార భాజపా ప్రతిపక్ష రహిత భారత్‌ను నెలకొల్పాలని కోరుకుంటోందన్నారు. అంతేగాకుండా తనను ఎదిరించి నిలబడిన నేతల ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తుందని దుయ్యబట్టారు. 

‘అరవింద్ కేజ్రీవాల్ రాజకీయంగా ఎదుగుతున్నారని, ఆయనపై సీబీఐ దృష్టి సారిస్తుందని నేను ఇంతకుముందే కథనం రాశాను. కొద్దికాలంగా దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం అవుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. అన్ని విపక్ష పార్టీలు వాటి మధ్య విభేదాలను పక్కన పెట్టి, ఈ అన్యాయంపై ఒక్కటిగా గళం వినిపించాలి. భాజపా ప్రతిపక్ష రహిత భారత్‌ను కోరుకుంటున్నారు. అందుకే విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఝార్ఖండ్‌, చత్తీస్‌గఢ్‌, కేరళ సహా పలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులను లక్ష్యంగా చేసుకుంటున్న తీరును మనం చూస్తున్నాం’ అని విరుచుకుపడ్డారు. 

సిబల్‌.. భాజపా ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు ‘ఇన్సాఫ్‌’ (Insaaf) పేరిట వేదికను స్థాపించిన సంగతి తెలిసిందే. దానికి చెందిన ట్విటర్ వేదిక.. గతంలో సిబల్ చెప్పిన జోస్యాన్ని నెట్టింట్లో షేర్ చేసింది. ‘కేజ్రీవాల్‌పై చర్యల గురించి ఎనిమిది నెలల క్రితమే సిబల్ అంచనా వేశారు. కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం జరగొచ్చని చెప్పారు. ఇప్పుడు ఆ అంచనా నిజమైనట్లు కనిపిస్తోంది’ అని రాసుకొచ్చింది. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు