Karnataka: ఉచిత బియ్యం బదులు డబ్బులు.. కర్ణాటక సర్కారు కీలక నిర్ణయం

కర్ణాటక (Karnataka)లో బియ్యం కొరత కారణంగా అన్నభాగ్య పథకం అమలుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో సిద్ధరామయ్య ప్రభుత్వం బియ్యం బదులు డబ్బులు ఇవ్వాలని నిర్ణయించింది.

Updated : 28 Jun 2023 16:38 IST

బెంగళూరు: కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ (Congress) ఇచ్చిన ఐదు హామీల్లో ఒకటైన అన్నభాగ్య పథకం (Anna Bhagya scheme) అమలుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పథకాన్ని జులై 1 నుంచి అమల్లోకి తీసుకురావాల్సి ఉండగా.. అందుకు అవసరమైన బియ్యం సేకరణ సాధ్యం కావట్లేదు. దీంతో సిద్ధరామయ్య (Siddaramaiah) సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత బియ్యానికి బదులుగా నగదు ఇస్తామని ప్రకటించింది. కిలో బియ్యానికి రూ.34 చొప్పున ఐదు కిలోల బియ్యానికి (Ration Rice) సమానమైన డబ్బును బీపీఎల్‌ ఖాతాదారుల (BPL card holders) బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.

కేబినెట్‌ భేటీ నిర్ణయాలను రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి కేహెచ్‌ మునియప్ప మీడియాకు వెల్లడించారు. ‘‘ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా (FCI) ప్రకారం కిలో బియ్యానికి ప్రామాణిక ధర రూ.34గా ఉంది. బీపీఎల్‌(దారిద్ర్య రేఖకు దిగువన్న ఉన్నవారు) ఖాతాదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసేందుకు మేం విశ్వప్రయత్నాలు చేశాం. కానీ మన రాష్ట్రానికి అవసరమైన బియ్యాన్ని సరఫరా చేసేందుకు ఏ సంస్థా ముందుకు రావట్లేదు. ఇక, అన్నభాగ్య పథకాన్ని జులై 1 నుంచి ప్రారంభించాల్సి ఉంది. బియ్యం కొరత కారణంగా పథకం అమలును ఆపలేం. అందుకే అందుకు సమానమైన డబ్బులను ఇవ్వనున్నాం. బియ్యం అందుబాటులోకి వచ్చేవరకు.. కిలో బియ్యానికి రూ.34 చొప్పున నగదును అందిస్తాం. జులై 1 నుంచి ఈ నగదు నేరుగా ఖాతాదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. ఒక రేషన్‌ కార్డులో ఒక వ్యక్తి ఉంటే నెలకు రూ.170 వస్తాయి. అదే ఇద్దరు వ్యక్తులైతే రూ.340, ఐదుగురు కుటుంబసభ్యులుంటే నెలకు రూ.850 జమ చేస్తాం’’ అని మంత్రి వివరించారు.

అన్నభాగ్య పథకం కుటుంబంలో ప్రతి ఒక్కరికి నెలకు 5 కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా అందిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ఇప్పటికే కేంద్రం అందిస్తున్న 5 కిలోల బియ్యానికి ఇది అదనం. అయితే ఇందుకు అవసరమైన ధాన్యం సేకరణ విషయంలో ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం నడిచింది. అన్నభాగ్య పథకం (Anna Bhagya scheme) అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇచ్చేందుకు నిరాకరిస్తోందంటూ కాంగ్రెస్‌ ఆరోపిస్తుండగా.. బియ్యం ఇస్తామని తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని కేంద్రం స్పష్టంగా చెప్పింది. దీంతో ఎన్నికల హామీలను అమలు చేయడంలో సిద్ధూ సర్కారు విఫలమైందంటూ భాజపా నేతలు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని