కర్ణాటక కేబినెట్‌ కీలక నిర్ణయం.. ‘మతమార్పిడి వ్యతిరేక చట్టం’ రద్దుకు ఓకే

Anti conversion law: కర్ణాటకలో గతంలో భాజపా ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులకు సిద్ధరామయ్య సర్కారు తిలోదకాలు ఇస్తోంది. ఇందులో భాగంగానే వివాదాస్పద మతమార్పిడి వ్యతిరేక చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది.

Published : 15 Jun 2023 17:41 IST

బెంగళూరు: కర్ణాటక (Karnataka)లో సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం (Congress Govt) కీలక నిర్ణయం తీసుకుంది. గత భాజపా (BJP) సర్కారు తీసుకొచ్చిన ‘మతమార్పిడి వ్యతిరేక చట్టాన్ని (anti conversion law)’ రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కర్ణాటక కేబినెట్‌ (Cabinet) గురువారం రద్దు ప్రతిపాదనను ఆమోదించింది. ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్‌ తెలిపారు. త్వరలో దీన్ని శాసనసభలో ప్రవేశపెట్టి చట్టాన్ని రద్దు చేయనున్నారు.

ఏంటీ చట్టం..

కర్ణాటకలో గత భాజపా ప్రభుత్వం మత మార్పిడి వ్యతిరేక చట్టాన్ని (anti conversion law) అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. బలవంతంగా, వంచించి, ఒత్తిళ్లు తీసుకు వచ్చి, తాయిలాలను ఆశచూపి, వివాహం చేసుకుంటానని నమ్మించి మతమార్పిడికి పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా ఈ చట్టాన్ని రూపొందించారు. దీనికి సంబంధించి పౌరులు, కుటుంబ సభ్యులు, భాగస్వాములు, సహోద్యోగులు పోలీసులు, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. బలవంతంగా మత మార్పిడికి పాల్పడితే జామీను రహిత అరెస్టు ఉంటుంది. బలవంతంగా మత మార్పిడులకు పాల్పడే వ్యక్తులకు 3 నుంచి 10 ఏళ్ల శిక్ష, రూ.50 వేల వరకు జరిమానా విధించేలా చట్టంలో నిబంధనలు పొందుపరిచారు.

ఇందుకు సంబంధించిన బిల్లును గతేడాది అప్పటి ముఖ్యమంత్రి బొమ్మై నేతృత్వంలో శాసనసభలో ప్రవేశపెట్టారు. అక్కడ ఈ బిల్లు ఆమోదం పొందింది. అయితే, శాసనమండలిలో భాజపాకు సరిపడా మెజార్టీ లేకపోవడంతో బిల్లు ముందుకెళ్లలేదు. దీంతో గతేడాది మే నెలలో ఆర్డినెన్స్‌ ద్వారా ఆదేశాలను అమల్లోకి తెచ్చారు. ఆ తర్వాత గవర్నర్‌ ఆమోదంతో చట్టాన్ని అమలు చేశారు. ఇప్పుడు భాజపా ప్రభుత్వాన్ని గద్దె దించి కాంగ్రెస్‌ అధికారంలో రావడంతో సిద్ధరామయ్య సర్కారు.. ఈ చట్టాన్ని రద్దు చేసింది.

దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో రాజ్యాంగ పీఠికను చదవడం తప్పనిసరి చేసింది. ఇక, ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకుడు కే.బి. హెడ్గేవార్‌ గురించిన పాఠాన్ని స్కూల్‌ పాఠ్యాంశాల నుంచి తొలగించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఈ పాఠ్యాంశాన్ని కూడా గతేడాది భాజపా సర్కారు సిలబస్‌లో చేర్చింది. ఇదొక్కటే గాక.. భాజపా సర్కారు సిలబస్‌లో చేసిన మార్పులన్నింటినీ రద్దు చేయాలని సిద్ధూ కేబినెట్‌ నిర్ణయించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని