Savarkar పాఠం తీసివేత.. ‘న్యూటన్‌’ సిద్ధాంతంతో సావర్కర్‌ మనవడి కౌంటర్‌

కర్ణాటక పాఠ్యాంశాల్లో సావర్కర్‌ (Savarkar) పాఠాలను తొలగించినా విద్యార్థులకు ఆ సమాచారం అందడంలో ఏ తేడా ఉండదని ఆయన మనవడు రంజిత్‌ సావర్కర్‌ అన్నారు. అయితే ఈ చర్యకు ప్రతిచర్య తప్పదని హెచ్చరించారు.

Published : 17 Jun 2023 16:28 IST

పనాజీ: స్కూల్‌ పాఠ్యాంశాల నుంచి హిందూ సిద్ధాంతరకర్త వీర్‌ సావర్కర్‌ (V D Savarkar) పాఠం తొలగిస్తూ కర్ణాటక ప్రభుత్వం (Karnataka Govt) తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. దీనిపై కాషాయ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ అంశంపై తాజాగా సావర్కర్‌ మనవడు రంజిత్‌ సావర్కర్‌ (Ranjit Savarkar) స్పందిస్తూ.. ‘న్యూటన్‌’ సిద్ధాంతంతో సిద్ధరామయ్య సర్కారుకు కౌంటర్‌ ఇచ్చారు. ఈ చర్యకు ప్రతిచర్య తప్పదని హెచ్చరించారు.

‘‘పాఠ్యాంశాలను తొలగిస్తే విద్యార్థులు సావర్కర్‌ గురించి తెలుసుకునే అవకాశం ఉండదని కాంగ్రెస్‌ భావించిందేమో..! కానీ, విద్యార్థులు చాలా తెలివైన వారు. సామాజిక మాధ్యమాలు, ఆన్‌లైన్‌లో సావర్కర్‌పై చాలా సమాచారం అందుబాటులో ఉంది. సావర్కర్‌ స్మారక్‌ కూడా తమ వెబ్‌సైట్‌లో ఆ సమాచారాన్ని ఉంచింది. అందువల్ల పాఠాలను తొలగించినంత మాత్రాన ఏ తేడా ఉండదు. వాస్తవానికి.. మీరు దేన్నైనా ఎంత అణచివేయాలనుకుంటే.. అది అంత బలంగా పుంజుకుంటుందనేది సహజం. మనం చేసే ప్రతీ చర్యకు అదే స్థాయిలో ప్రతిచర్య ఉంటుంది’’ అని రంజిత్‌ సావర్కర్‌ (Ranjit Savarkar) కాంగ్రెస్‌ (Congress) సర్కారుపై విమర్శలు గుప్పించారు.

ఇదీ చదవండి: కాషాయ హంగులకు చెల్లు

గత భాజపా ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన అనేక విధానాలను సిద్ధరామయ్య సర్కారు సవరించే పనిలో పడిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మతం, కులాన్ని ప్రత్యేకించి బోధించే విద్యా విధానాన్ని సమూలంగా మార్చాలని నిర్ణయించింది. 6 నుంచి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాల్లో ఏదేని హిందుత్వ విధానాలను ప్రచారం చేసే అంశాలుంటే వాటిని తొలగించాలని తీర్మానించింది.  హిందూ మహాసభ నేత వి.డి.సావర్కర్‌ (Savarkar), ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకుడు హెడ్గేవార్‌, నాయకుడు సొలిబెలె చక్రవర్తి పాఠాలను కూడా తొలగించాలని ఇటీవల కేబినెట్‌ సమావేశంలో నిర్ణయించింది. అయితే ఇది విమర్శలకు దారితీసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు