Facebook: ఇలాగైతే మీ కార్యకలాపాలు ఆపేస్తాం.. ఫేస్‌బుక్‌కు కర్ణాటక హైకోర్టు వార్నింగ్‌!

కేసుల విచారణ విషయంలో పోలీసులకు సహకారం అందించకుంటే భారత్‌లో ఫేస్‌బుక్‌ (Facebook) కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేస్తామని కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) హెచ్చరించింది. 

Published : 15 Jun 2023 16:54 IST

బెంగళూరు: సోషల్‌ మీడియా (Social Media) దిగ్గజం ఫేస్‌బుక్‌ (Facebook) కార్యకలాపాలను భారత్‌లో నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేస్తామని కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) మెటా (Meta) సంస్థను హెచ్చరించింది. సౌదీ అరేబియా (Saudi Arabia)లో అరెస్టైన భారతీయ వ్యక్తికి సంబంధించిన కేసులో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. దక్షిణ కన్నడ జిల్లా బికర్నకట్టె ప్రాంతానికి చెందిన శైలేష్‌ కుమార్‌ అనే వ్యక్తి గత 25 ఏళ్లుగా సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడు. అతని భార్య కవిత, పిల్లలతో కలిసి బికర్నకట్టెలో నివాసం ఉంటోంది. 2019లో శైలేష్‌ కుమార్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు మద్దతుగా పోస్ట్‌లు చేశాడు.

ఈ పోస్ట్‌లు చేసిన కొద్దిరోజుల తర్వాత శైలేష్‌ కుమార్‌ పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ ఖాతాను తెరిచి.. సౌదీ అరేబియా రాజుకి వ్యతిరేకంగా కొన్ని పోస్ట్‌లు చేశారు. ఈ విషయమై శైలేష్‌ తన కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. దీంతో అతని భార్య కవిత నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాపై మంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ ప్రారంభించిన మంగళూరు పోలీసులు.. ఫేస్‌బుక్‌ నుంచి సమాచారం కోరగా.. ఎటువంటి స్పందన రాలేదు. మరోవైపు రాజుకు వ్యతిరేకంగా పోస్ట్‌లు చేసినందుకు సౌదీ అరేబియా పోలీసులు శైలేష్‌ కుమార్‌ను అరెస్ట్‌ చేశారు. తన భర్త ఫేస్‌బుక్‌ నకిలీ ఖాతా కేసు విచారణలో జాప్యం జరుగుతోందని.. కవిత కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దాంతోపాటు తన భర్తను సౌదీ జైలు నుంచి విడుదల చేయించాలని కోరుతూ ఆమె కేంద్రానికి లేఖ రాశారు. 

కవిత పిటిషన్‌పై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు, నకిలీ ఖాతాకు సంబంధించి వారంలోగా నివేదిక సమర్పించాలని ఫేస్‌బుక్‌ను ఆదేశించింది. నిర్ణీత గడువులోగా నివేదిక సమర్పించకుంటే భారత్‌లో ఫేస్‌బుక్‌ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశిస్తామని హైకోర్టు ధర్మాసనం హెచ్చరించింది. అలానే, సౌదీ జైలు నుంచి శైలేష్‌ కుమార్‌ను విడిపించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది. మంగళూరు పోలీసులు కూడా తమ విచారణకు సంబంధించి నివేదికను కోర్టు సమర్పించాలని సూచించింది. తదుపరి విచారణను జూన్‌ 22కు వాయిదా వేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని