Elecricity bill: వాడేది రెండే బల్బులు.. బిల్లు రూ.లక్ష చూసి కంగుతిన్న వృద్ధురాలు

కర్ణాటకలో చిన్న ఇంట్లో ఉంటూ కేవలం రెండు బల్బులే వినియోగించే ఓ వృద్ధురాలకి మే నెల కరెంటు బిల్లు రూ. లక్ష వచ్చింది. అధికారులు ఆమె గృహాన్ని పరిశీలించి మీటరులో లోపం వల్లే అధిక బిల్లు వచ్చిందని నిర్ధారించారు.

Published : 23 Jun 2023 18:02 IST

బెంగళూరు: ఇంట్లో ఏసీ, టీవీ, రిఫ్రిజిరేటర్‌ ఇతరత్రా వస్తువులు ఉన్న వారికి రూ.వేలల్లో మాత్రమే కరెంటు బిల్లు వస్తుంది. కానీ కర్ణాటకలోని కొప్పల్‌లో నివసిస్తున్న ఓ వృద్ధురాలికి మే నెల కరెంటు బిల్లు రూ.లక్ష  వచ్చింది. ఆమె ఇంట్లో రెండు సాధారణ బల్బులు మినహా ఇతర వస్తువులేవీ లేకపోవడం గమనార్హం. 

గిరిజమ్మ అనే వృద్ధురాలు(90) కొప్పల్‌లోని భాగ్యనగర్‌లో నివసిస్తోంది. ఆమెకు భాగ్యజ్యోతి పథకం కింద విద్యుత్తు కనెక్షన్‌ ఉంది.  ఈ పథకం కింద దారిద్ర్యరేఖకు దిగువనున్న రేషన్‌కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకే విద్యుత్తును అందిస్తోంది. ఈ పథకం కింద ఆమెకు 18 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు లభిస్తుంది. అందువల్ల ప్రతినెల రూ.70 నుంచి రూ.80 వరకు కరెంటు బిల్లు వస్తుందని గిరిజమ్మ తెలిపింది. మే నెల బిల్లు రూ. లక్ష వచ్చిందని తెలిపింది. గుల్బర్గా ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్‌ (GESCOM) అధికారులకు ఈ విషయం తెలియజేసినా తొలుత పట్టించుకోలేదని బిల్లు ఎంత వస్తే అంతే కట్టామన్నారని చెప్పింది. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసి నిరసన తెలపడంతో అధికారులు బాధితురాలి గృహాన్ని సందర్శించారు. ఆమె ఇంట్లో ఉన్న మీటరులో తప్పిదం కారణంగానే ఎక్కువ బిల్లు వచ్చిందన్నారు. మీటరులో లోపాన్ని సరిచేసి సరైన బిల్లు ఇచ్చి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

 


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు