SDG సూచీ: కేరళ టాప్‌.. చిట్టచివర బిహార్‌..!

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో కేరళ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. నీతిఆయోగ్‌ విడుదల చేసిన తాజా నివేదికలో కేరళ తొలి స్థానంలో కొనసాగగా.. బిహార్‌ చివరి స్థానంలో ఉంది.

Published : 03 Jun 2021 15:20 IST

భారత్‌లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై నీతి ఆయోగ్‌ నివేదిక

దిల్లీ: సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో కేరళ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. నీతిఆయోగ్‌ విడుదల చేసిన తాజా నివేదికలో కేరళ తొలి స్థానంలో కొనసాగగా.. బిహార్‌ చివరి స్థానంలో ఉంది. హిమాచల్‌ ప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో 2వ స్థానంలో నిలిచాయి. ఇక కేంద్రపాలిత ప్రాంతాల్లో చండీగఢ్‌ తొలిస్థానంలో నిలిచింది.

భారత్‌లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఆయా ప్రభుత్వాల పనితీరును పర్యవేక్షిస్తోన్న నీతిఆయోగ్‌, ప్రతిఏటా నివేదిక ఇస్తుంది. సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాలను పరిగణలోకి తీసుకొని నీతిఆయోగ్‌ ఈ ర్యాంకులను కేటాయిస్తుంది. 2018 నుంచి వీటిని ప్రకటిస్తుండగా.. తాజాగా మూడో ఎడిషన్‌ను నీతిఆయోగ్‌ ప్రకటించింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీ 2020-21 నివేదికను నీతిఆయోగ్‌ ఉపాధ్యక్షులు రాజీవ్‌ కుమార్‌ తాజాగా విడుదల చేశారు. ఇందులో 75స్కోరుతో కేరళ తొలిస్థానాన్ని మరోసారి నిలబెట్టుకోగా 74 స్కోరుతో హిమాచల్‌ ప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాలు రెండో స్థానంలో నిలిచాయి. ఇక ఈ ఏడాది సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో బిహార్‌ అత్యంత పేలవమైన పనితీరు కనబరిచింది. బిహార్‌, ఝార్ఖండ్‌, అస్సాం రాష్ట్రాలు చిట్టచివరలో నిలిచాయి. ఇక ఈ సూచీలో 73 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో నిలవగా..  తెలంగాణ 69 పాయింట్లతో మెరుగైన పనితీరును కనబరిచాయి.

దేశంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పురోగతిని పర్యవేక్షించడానికి ఈ సూచీలు ప్రాథమిక సాధనంగా మారాయని నీతిఆయోగ్‌ పేర్కొంది. అంతేకాకుండా ఇలాంటి ర్యాంకులను ఇవ్వడం ద్వారా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య పోటీని ప్రోత్సహించేందుకు దోహదపడుతుందని అభిప్రాయపడింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ఈ సూచీల ద్వారా పర్యవేక్షించే ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ కుమార్‌ స్పష్టంచేశారు.

ఐరాస నిర్ధేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన కోసం ఆయా దేశాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా 17 లక్ష్యాలు, మరో 169 సంబంధిత అంశాల్లో 2030 నాటికి లక్ష్యాలను సాధించాలని ఐరాస నిర్దేశించింది. ఇందులో భాగంగా భారత్‌లోని ఐరాస విభాగాలతోపాటు పలు కేంద్ర శాఖల సహకారంతో అన్ని రాష్ట్రాల్లో ఈ లక్ష్యాల పనితీరును నీతి ఆయోగ్‌ పర్యవేక్షిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని