Kuno National Park: చీతా ట్రాకింగ్‌ బృందంపై గ్రామస్థుల దాడి

కునో నేషనల్‌పార్కు (Kuno National Park) అధికారులపై మధ్యప్రదేశ్‌లోని (Madhyapradesh) ఓ గ్రామస్థులు దాడి చేశారు. చీతాను వెతుక్కుంటూ వెళ్లిన వారిని దొంగలుగా భావించి చావబాదారు.

Published : 27 May 2023 02:04 IST

భోపాల్‌: దొంగలుగా భావించి చీతా ట్రాకింగ్‌ బృందంపై మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాకు చెందిన గ్రామస్థులు దాడి చేశారు. అధికారులమని చెబుతున్నా వినిపించుకోకుండా వారిపై దాడికి పాల్పడ్డారు. కునో నేషనల్‌ పార్కులో గురువారం రెండు చీతా కూనలు మృతి చెందిన సంగతి తెలిసిందే. అదే రోజు రాత్రి ‘ఆశా’అనే ఆడ చీతా కునో నేషనల్‌ పార్కు పరిధి దాటి వెళ్లిపోయింది. దానిని వెతుక్కుంటూ నలుగురు సభ్యుల ట్రాకింగ్‌ బృందం శుక్రవారం తెల్లవారుజామున కునో నేషనల్‌ పార్కుకు సమీపంలోని బురఖేడా గ్రామంలోకి వెళ్లారు.

గమనించిన గ్రామస్థులు వారిని ప్రశ్నించారు. రాత్రివేళ గ్రామంలోని రావాల్సిన అవసరమేంటని నిలదీశారు. తాము అటవీశాఖ అధికారులమని, చీతా తప్పిపోతే వెతికేందుకు వచ్చామని చెబుతున్నా వినలేదు. దొంగలుగా భావించి దాడి చేశారు. ఈ ఘటనలో ఓ అధికారికి తీవ్రంగా గాయాలయ్యాయి. వాళ్లు తీసుకెళ్లిన వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. పరిస్థితి చేయిదాటి పోవడంతో.. కునో నేషనల్‌ పార్కు అధికారులకు సమాచారం అందించారు. తాము ఫలానా చోట ఉన్నామని, వెంటనే మరో బృందాన్ని పంపాలని కోరారు. మరో బృందం అక్కడికి చేరుకోవడంతో గొడవ సద్దుమణిగింది. గ్రామస్థులపై కేసు నమోదు చేసినట్లు డివిజన్‌ అటవీశాఖ అధికారి (డీఎఫ్‌ఓ) ప్రకాశ్‌కుమార్‌ వర్మ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని