Lalu Prasad: లాలూ కిడ్నీ మార్పిడి విజయవంతం.. తండ్రికి అవయవ దానం చేసిన తనయ

ఆర్జేడీ అధినేత, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స పూర్తయ్యింది. లాలూ రెండో కుమార్తె రోహిణి ఆయనకు అవయవ దానం చేశారు. సింగపూర్‌లో ఈ సర్జరీ విజయవంతమైందని, వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని లాలూ తనయుడు తేజస్వి యాదవ్‌ వెల్లడించారు.

Published : 05 Dec 2022 21:45 IST

పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (Lalu Prasad Yadav)కు మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది. లాలూ కుమార్తె రోహిణి అర్చన ఆయనకు కిడ్నీ దానం చేశారు. సింగపూర్‌లోని మౌంట్‌ ఎలిజబెత్‌ ఆసుపత్రిలో సోమవారం ఈ శస్త్రచికిత్స పూర్తయ్యింది. ప్రస్తుతం వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని లాలూ తనయుడు, బిహార్‌ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ వెల్లడించారు. లాలూను ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి ఐసీయూకు తరలిస్తున్న వీడియో ట్వీట్‌ చేసిన ఆయన.. తమ కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఎంతోకాలంగా కిడ్నీ సంబంధ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. పరీక్షించిన వైద్యులు కిడ్నీ మార్పిడి (Kidney Transplant) అనివార్యమని సూచించారు. దీంతో తన కిడ్నీని నాన్నకు ఇస్తానంటూ సింగపూర్‌లో ఉంటున్న లాలూ రెండో కుమార్తె రోహిణి ముందుకొచ్చారు. ‘నా తల్లిదండ్రులే నాకు దేవుళ్లు. వారికోసం ఏదైనా చేస్తా’ అంటూ చెప్పిన ఆమె.. కిడ్నీ అనేది తన శరీరంలోని ఓ చిన్న ముక్క మాత్రమే అని పేర్కొన్నారు. తాజాగా సర్జరీ జరిగే కొన్ని నిమిషాల ముందు ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ తమకు గుడ్‌లక్‌ చెప్పండంటూ తండ్రితో కూర్చున్న ఓ ఫొటో పోస్టు చేశారు.

ఇదిలాఉంటే, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ దాణా కుంభకోణానికి (Fodder Scam) సంబంధించిన కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అనారోగ్య కారణాలతో ఇటీవలే ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కోసం సింగపూర్‌కు వెళ్లేందుకు కోర్టు అనుమతి పొందిన ఆయన.. కుమార్తె కిడ్నీ దానంతో శస్త్రచికిత్స జరిగింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని