Brij Bhushan: బ్రిజ్‌భూషణ్‌ తరఫున ఆ లాయర్‌..!

రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్‌భూషణ్‌ తరపున ఓ ప్రముఖ లాయర్‌ రంగంలోకి దిగారు. గతంలో ఆయన దేశంలోనే సంచలనం సృష్టించిన కేసులో వాదించారు. 

Published : 19 Jul 2023 12:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మహిళా క్రీడాకారిణులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జాతీయ రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్ తరపున న్యాయవాది రాజీవ్‌ మోహన్‌ వాదనలు వినిపించారు. ఆయన 2012లో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ హోదాలో నిర్భయ కేసులో దిల్లీ పోలీసుల తరపున వాదనలు వినిపించారు. నిర్భయ గ్యాంగ్‌ రేప్‌ కేసులో నలుగురు నిందితులకు 2020లో ఉరిశిక్ష అమలైంది. ఈ కేసు దేశ స్థాయిలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసు తర్వాతే దేశంలో మహిళలపై నేరాల విషయంలో కఠిన చట్టాలను అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రెజ్లర్ల కేసుపై నిర్భయ తల్లి జూన్‌లో స్పందిస్తూ.. ఈ వ్యవహారంలో దర్యాప్తు సరిగ్గా జరగకపోతే.. దేశ న్యాయవ్యవస్థకు ఓ మరకలా మిగిలిపోతుందని పేర్కొంది.

సరిహద్దులు దాటిన ప్రేమికా.. సీమాంతర గూఢచర్య ప్రతినిధా!

మంగళవారం మోహన్‌ దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ఎదుట హాజరై వాదనలు వినిపించారు. బ్రిజ్‌భూషణ్‌కు మంగళవారం న్యాయస్థానం మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. రెగ్యూలర్‌ బెయిల్‌ పిటిషన్‌పై రేపు వాదనలు విననుంది. 

బ్రిజ్‌భూషణ్‌ తమను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ.. వినేశ్‌ ఫొగాట్‌, సాక్షి మాలిక్‌ సహా పలువురు మహిళా రెజ్లర్లు ఆందోళన చేపట్టారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో దిల్లీ పోలీసులు అతడిపై కేసులు నమోదు చేశారు. రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ సహాయ కార్యదర్శి వినోద్‌ తోమర్‌పైనా వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. వాటిపై దర్యాప్తు చేపట్టి.. జులై 15న కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ క్రమంలోనే.. ఈ కేసులో నిందితుడిపై విచారణ జరిపేందుకు తగిన సాక్ష్యాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. జూలై 18న కోర్టు ముందు హాజరుకావాలని బ్రిజ్‌భూషణ్‌తోపాటు వినోద్‌ తోమర్‌కూ సమన్లు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని