Delhi: దిల్లీలో ఆంక్షలు.. మెట్రోల వద్ద 2 కి.మీ మేర ప్రయాణికుల బారులు

కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ ఉద్ధృతి నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో మళ్లీ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. నైట్‌ కర్ఫ్యూతో పాటు పాఠశాలలు, కళాశాలలు, జిమ్‌లు, సినిమా హాళ్లను

Updated : 29 Dec 2021 15:47 IST

దిల్లీ: కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ ఉద్ధృతి నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో మళ్లీ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. నైట్‌ కర్ఫ్యూతో పాటు పాఠశాలలు, కళాశాలలు, జిమ్‌లు, సినిమా హాళ్లను మూసివేశారు. ఇక, మెట్రో రైళ్లు, బస్సులను 50శాతం సామర్థ్యంతో మాత్రమే నడపాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే కొత్త నిబంధనలతో దిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం ఉదయం పలు బస్టాప్‌లు, మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణికులు బారులు తీరి కన్పించారు. 

ఒక సర్వీసుకు సగం మందితో మాత్రమే బస్సులను, మెట్రోలను నడిపేందుకు అనుమతి ఉండటంతో బస్టాప్‌లు, మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు. కొన్ని మెట్రో స్టేషన్ల వద్ద అయితే ఈ క్యూలైన్‌ దాదాపు 2 కిలోమీటర్లకు పైనే ఉండటం గమనార్హం. ‘‘కొత్త ఆంక్షల కారణంగా మేం వెళ్లాల్సిన సమయం కంటే 2 గంటలు ముందే ఇంటి నుంచి బయటకు రావాల్సి వస్తోంది. అయినా కూడా ఇక్కడ రద్దీగానే ఉంటోంది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఇది మంచి నిర్ణయమే అయినప్పటికీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఉండాల్సింది’’ అని ప్రయాణికులు తమ ఇబ్బందిని చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. రద్దీ నేపథ్యంలో కొందరు కరోనా నిబంధనలను గాలికొదిలేస్తున్నారు. చాలా స్టేషన్ల వద్ద ప్రయాణికులు కనీసం మాస్క్‌లు కూడా ధరించకుండా కన్పించారు. భౌతిక దూరం కూడా పాటించకుండా గుంపులుగుంపులుగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని