Covid: కొవిడ్‌ మళ్లీ ‘మహా’ విజృంభణ.. ఒక్కరోజే అక్కడ 4,255 కేసులు

మహారాష్ట్రలో కరోనా విజృంభణ (Coronavirus) మరోసారి ఆందోళనకర రీతిలో కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4255 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Published : 16 Jun 2022 22:26 IST

పుణెలో మరో రెండు బీఏ.5 వేరియంట్‌ కేసులు

ముంబయి: మహారాష్ట్రలో కరోనా విజృంభణ (Corona virus) మరోసారి ఆందోళనకర రీతిలో కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,255 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ముందురోజుతో పోలిస్తే 231 కేసులు అధికంగా వెలుగుచూశాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 12న మహారాష్ట్రలో అత్యధికంగా 4,359 కేసులు నమోదుకాగా.. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో కేసులు రావడం ఇదే ప్రథమం. మరోవైపు, కొవిడ్‌ సోకిన వారిలో తాజాగా ముగ్గురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

మరో రెండు బీఏ.5 వేరియంట్‌..

ఓ వైపు రోజువారీ కేసులు పెరగడంతో పాటు రాష్ట్రంలో మరో రెండు కొత్త వేరియంట్‌ బీఏ.5 కేసులు కూడా బయటపడినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. నాగ్‌పుర్‌కు చెందిన 29ఏళ్ల యువకుడికి జూన్‌ 6న కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. మరోవైపు 54 ఏళ్ల మహిళకు జూన్‌ 9 పాజిటివ్‌ నిర్ధారణ కాగా.. తాజాగా ఈ వేరియంట్ సోకినట్లు తేలింది. అయితే, వీరిద్దరిలో ఇటీవల ఒకరు కేరళ, మరొకరు ముంబయి ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. వారిద్దరూ వ్యాక్సిన్‌ తీసుకున్నారని.. ప్రస్తుతం వారు ఇంట్లోనే కోలుకున్నట్టు తెలిపింది. దీంతో ఇప్పటివరకు మహారాష్ట్రలో బీఏ.4, బీఏ.5 వేరియంట్లు సోకిన బాధితుల సంఖ్య 19కి చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ముంబయిలో నేడు ఒక్కరోజే 2,366 కేసులు బయటపడినట్లు బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. దీంతో నగరంలో కొవిడ్‌ క్రియాశీల కేసుల సంఖ్య 13వేలు దాటినట్లు వెల్లడించింది. అయితే, కొవిడ్‌ సోకిన బాధితుల్లో కొంతమంది మాత్రమే ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తోందని.. దాదాపు 97శాతం బాధితులు ఇంటివద్దే కోలుకుంటున్నట్లు వివరించింది.

ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 12వేల కేసులు వెలుగు చూశాయి. ముందురోజుతో పోలిస్తే పాజిటివ్‌ కేసుల్లో 38శాతం పెరుగుదల కనిపించింది. దీంతో దేశవ్యాప్తంగా కొవిడ్‌ పాజిటివిటీ రేటు 2.35 శాతానికి ఎగబాకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో 4వేలకు పైగా, కేరళలో 3400 కేసులతో పాటు దిల్లీ, కర్ణాటకల్లోనూ అధిక కేసులు నమోదైనట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని