India-Maldives: దౌత్య విభేదాల వేళ.. భారత్‌కు మాల్దీవుల అధ్యక్షుడు..?

India-Maldives: మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు మరికొద్ది రోజుల్లో భారత్‌లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ‘లక్షద్వీప్‌’ విషయంలో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాల వేళ.. ఈ వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Updated : 11 Jan 2024 13:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత ప్రధాని మోదీ (PM Modi)పై, లక్షద్వీప్‌ (Lakshadweep) పరిసరాలపై తమ మంత్రులు, ఎంపీలు చేసిన వ్యాఖ్యలతో మాల్దీవుల (Maldives) ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఆయా మంత్రులపై వేటు వేసిన అక్కడి సర్కారు.. భారత్‌ (India)తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు (Mohamed Muizzu) త్వరలోనే భారత పర్యటనకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.

ప్రస్తుతం మాల్దీవుల అధికారులు.. అధ్యక్షుడి దిల్లీ పర్యటనకు షెడ్యూల్‌ ఖరారు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటివారంలో ఆయన భారత్‌లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. అయితే, తాజా విభేదాలతో దీనికి ఎలాంటి సంబంధం లేదని, అంతకంటే ముందుగానే మాల్దీవుల ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సదరు కథనాలు వెల్లడించాయి. గతేడాది యూఏఈలో జరిగిన కాప్‌28 పర్యావరణ సదస్సులో భారత ప్రధాని మోదీతో ముయిజ్జు భేటీ అయ్యారు. ఆ సమయంలోనే ఆయన దిల్లీ పర్యటనపై చర్చ జరిగినట్లు సమాచారం.

మాల్దీవుల వివాదం.. బయటపడిన చైనా వక్రబుద్ధి

ముయిజ్జు ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేపట్టిన తొలి విదేశీ పర్యటన ఇదే. ఈ సందర్భంగా బీజింగ్‌ చేపట్టిన బీఆర్‌ఐ ప్రాజెక్టుపై ప్రశంసలు కురిపించారు. ముయిజ్జుకు డ్రాగన్‌కు అనుకూలమైన వ్యక్తిగా పేరుంది. ఇక, భారత్‌తో విభేదాల నేపథ్యంలో స్వదేశంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయనపై అవిశ్వాస తీర్మానం తీసుకురావాలని ప్రతిపక్షాలు యోచిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని