Sexual Offenders: 10లక్షల మంది లైంగిక నేరస్థుల చిట్టా రెడీ..!

లైంగిక నేరాలకు పాల్పడే వారిని తేలికగా గుర్తించి, దర్యాప్తులను మరింత వేగవంతం చేసే ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా లైంగిక నేరాలకు పాల్పడుతోన్న 10 లక్షల మంది వివరాలతో కూడిన డేటాబేస్‌ను సిద్ధం చేసింది.

Published : 28 Apr 2022 01:36 IST

దర్యాప్తు సంస్థలకు అందుబాటులో ఉంచిన కేంద్ర హోంశాఖ

దిల్లీ: లైంగిక నేరాలకు పాల్పడే వారిని తేలికగా గుర్తించి, దర్యాప్తులను మరింత వేగవంతం చేసే ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా లైంగిక నేరాలకు పాల్పడుతోన్న 10 లక్షల మంది వివరాలతో కూడిన డేటాబేస్‌ను సిద్ధం చేసింది. వీటిని వివిధ దర్యాప్తు సంస్థలకు అందుబాటులో ఉంచిన కేంద్ర హోంశాఖ, వీటిని ఎప్పటికప్పుడు నవీకరిస్తూనే ఉంటామని తెలిపింది. అంతేకాకుండా లైంగిక నేరస్థులకు సంబంధించి ఇటువంటి డేటాబేస్‌ను కేవలం కొన్ని దేశాలు మాత్రమే నిర్వహిస్తున్నాయని వెల్లడించింది.

కేంద్ర హోంశాఖ వార్షిక నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా లైంగిక నేరాలకు పాల్పడే వారి వివరాలను నేషనల్‌ డేటాబేస్‌ ఆన్‌ సెక్సువల్‌ అఫెండర్స్‌ (NDSO)లో పొందుపరిచారు. ముఖ్యంగా లైంగిక నేరాలకు పాల్పడిన వారి పేర్లు, అడ్రస్‌, ఫొటోలు, ఐడీ కార్డులతోపాటు నేరస్థుల వేలి ముద్రలను కూడా డేటాబేస్‌లో ఉంచారు. ఇప్పటివరకు 10.69లక్షల మంది వివరాలను అందులో నిక్షిప్తం చేయగా.. అత్యాచారం, గ్యాంగ్‌రేప్‌, మహిళలను వేధించడం, చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించి పోక్సో (POCSO) చట్టం కింద కేసులు ఎదుర్కొన్న వివరాలు అందులో ఉన్నాయి. వీటిని దేశవ్యాప్తంగా అన్ని దర్యాప్తు సంస్థలకు అందుబాటులో ఉంచారు. మహిళలపై వేధింపులు, అత్యాచారాలకు సంబంధించిన కేసుల్లో సత్వర దర్యాప్తు కోసం ఈ ఎన్‌డీఎస్‌ఓ సమాచారం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది.

లైంగిక నేరాల దర్యాప్తు వేగవంతం చేయడంలో భాగంగా ఇన్వెస్టిగేషన్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌(ఐటీఎస్‌ఎస్‌ఓ), లైంగిక నేరస్థుల డేటాబేస్‌ (ఎన్‌డీఎస్‌ఓ)లను 2018లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 10లక్షల మంది నేరస్థుల సమాచారాన్ని డేటాబేస్‌లో పొందుపరిచింది. అయితే, ఇటువంటి డేటాబేస్‌ ఇప్పటివరకు అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో వంటి కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని