Bipin Rawat: రావత్‌ అంత్యక్రియలకు తరలివచ్చిన పొరుగుదేశాల సైనికాధికారులు..

సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భారత్‌ పొరుగుదేశాలకు చెందిన కీలక సైనికాధికారులు దిల్లీకి చేరుకొన్నారు.

Updated : 10 Dec 2021 15:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పొరుగుదేశాలకు చెందిన కీలక సైనికాధికారులు దిల్లీకి చేరుకొన్నారు. వీరిలో శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌, భూటాన్‌ అధికారులు ఉన్నారు. శ్రీలంక సీడీఎస్‌ అండ్‌ కమాండర్‌ జనరల్‌ షవేంద్ర సిల్వా, శ్రీలంక మాజీ అడ్మిరల్‌ రవీంద్ర చంద్రసిరి (నేషనల్‌ డిఫెన్స్‌ కాలేజ్‌లో రావత్‌కు మంచి మిత్రుడు), రాయల్‌ భూటాన్‌ ఆర్మీ డిప్యూటీ ఆపరేషన్స్‌ చీఫ్‌ బ్రిగేడియర్‌ డోర్జీ రించన్‌, నేపాల్‌ చీఫ్‌ ఆఫ్‌ జనరల్‌ స్టాఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ బాలకృష్ణ కార్కీ,  బంగ్లాదేశ్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ డివిజన్‌ స్టాఫ్‌ ఆఫీసర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ వకార్‌ ఉజ్‌ జమాన్‌ హాజరయ్యారు. 

భూటాన్‌రాజు ప్రత్యేక ప్రార్థనలు..

తమిళనాడులో జరిగిన హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన బిపిన్‌ రావత్‌ దంపతులు, మిగిలిన సైనిక సిబ్బంది ఆత్మకు శాంతి చేకూరాలని భూటాన్‌ రాజు జిగ్మే కెసర్‌ నామగ్యాల్‌ దంపతులు, ఆయన తండ్రి గ్యాల్‌పో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ మేరకు ఫొటోలను భూటాన్‌లోని భారత దౌత్య కార్యాలయ ట్విటర్‌ పోస్టు చేసింది. ‘‘జనరల్‌ రావత్‌ భూటాన్‌ను పలు మార్లు సందర్శించారు. ఆయన్ను ఒక మిత్రుడిగా భూటాన్‌ ప్రజలు గుర్తుపెట్టుకొంటారు’’ అని రాజు జిగ్మే కెసర్‌ నామగ్యాల్‌ ఫేస్‌బుక్‌ ఖాతాలో పేర్కొన్నారు.

2017లో డోక్లాం ట్రైజంక్షన్‌ వద్ద భూటాన్‌ భూభాగాన్ని ఆక్రమించాలని చైనా ప్రయత్నించింది. అప్పుడు భూటాన్‌కు భారత్‌ అండగా నిలిచింది. ఆ సమయంలో బిపిన్‌ రావత్‌ సైన్యాధ్యక్షుడిగా వ్యవహరించారు. రావత్‌ పలు మార్లు భూటాన్‌ను సందర్శించారు. రావత్‌ ఆర్మీ చీఫ్‌గా ఉన్న సమయంలో నేపాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌, కజకిస్థాన్‌, తుర్కెమెనిస్థాన్‌, శ్రీలంక, రష్యా, వియత్నాం, టాంజానియా, కెన్యా, అమెరికా, మాల్దీవులను సందర్శించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని