Vande Bharat Express: కేరళలో వందే భారత్‌ రైలుపై మరోసారి రాళ్ల దాడి

కేరళ (Kerala)లో వందే భారత్‌ రైలు (Vande Bharat Express)పై రాళ్ల దాడి జరిగింది. రెండు వారాల వ్యవధిలో ఇది రెండో ఘటన. ఈ ఘటనలో రైలు అద్దాలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Updated : 22 Feb 2024 14:43 IST

తిరువనంతపురం: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్‌ రైళ్ల (Vande Bharat Express)పై ఆకతాయిలు రాళ్ల దాడికి పాల్పడుతున్నారు. తాజాగా కేరళ (Kerala)లోని కాసర్‌గోడ్‌ నుంచి తిరువనంతపురం వెళుతున్న వందే భారత్‌ రైలుపై గుర్తుతెలియని వ్యక్తులు మరోసారి రాళ్లతో దాడి చేశారని కేరళ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో రైలు అద్దాలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. రైలు వాలపట్టణం-కన్నూర్‌ మధ్య ఉండగా మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. దాడి జరిగినట్లు గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు.

ఈ ఘటనపై రైల్వే అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేరళలో రెండు వారాల వ్యవధిలో ఇది రెండో ఘటన. ఏప్రిల్‌ 25న ప్రధాని మోదీ (PM Narendra Modi) తిరువనంతపురం-కాసరగోడ్ మధ్య వందే భారత్‌ రైలును ప్రారంభించారు. తర్వాతి వారంలోనే రైలు తిరునవయ-తిరూర్‌ మధ్య ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో కోచ్‌ అద్దం ధ్వంసమైంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వందే భార‌త్ రైళ్లపై తరచుగా రాళ్ల దాడులు జరుగుతుండటంతో భద్రత కట్టుదిట్టం చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. గతంలో పలుచోట్ల వందే భారత్‌ రైలుపై రాళ్లదాడి ఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని