PM modi: కొందరు నా చావు కోరుతున్నారు.. ఆ విషయంలో సంతోషమే!: మోదీ

ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికలు చివరి దశకు చేరుకున్న వేళ ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated : 28 Feb 2022 04:34 IST

వారణాశి: ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికలు చివరి దశకు చేరుకున్న వేళ ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొందరు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని, చివరికి తన చావును సైతం కోరుకుంటున్నారంటూ విమర్శించారు. ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ గతేడాది ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యలనుద్దేశిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

గతేడాది ప్రధాని మోదీ వారణాశిలో పర్యటించారు. ఈ పర్యటన గురించి అఖిలేశ్‌ యాదవ్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘మంచిదే. ఒకరోజు కాదు.. మూడు నెలలైనా వారణాశిలో ఉండొచ్చు. అలా ఉండడానికి పూర్తి అనువైన ప్రదేశం. ఎందుకంటే చివరి రోజుల్లో అందరూ వారణాశిలోనే గడపాలని కోరుకుంటారు’’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై అప్పట్లోనే దుమారం రేగడంతో అఖిలేశ్‌ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. భాజపాకు రోజులు దగ్గర పడ్డాయన్న ఉద్దేశంలో తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు.

తాజాగా ఆ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించారు. చివరి రెండు దశల ఎన్నికల ప్రచారంలో భాగంగా వారణాశిలో ఆదివారం పర్యటించిన ఆయన.. ఆ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు. ‘‘కొందరు నేతలు పూర్తిగా దిగజారిపోయి వ్యవహరిస్తున్నారు. కొందరైతే ఏకంగా నా చావును కూడా కోరుతున్నారు. అదీ వారణాశిలోనే కావాలని కోరుకుంటున్నారు. ఈ విషయంలో నేను ఆనందంగా ఉన్నా. వారణాశి ప్రజలతో చివరి వరకు జీవించే అవకాశం దక్కుతున్నందుకు, ప్రాణం పోయే వరకు వారికి సేవ చేసుకునే భాగ్యం దక్కుతున్నందుకు ఆనందంగా ఉంది’’ అని మోదీ పేర్కొన్నారు. యూపీలో మార్చి3, మార్చి 7 తేదీల్లో చివరి రెండు విడత ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న యూపీతో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని