Sidhu Moose Wala: సిద్ధూ వెనకే వెళ్లిన తండ్రి.. కళ్లముందే కొడుకు హత్య చూసి..!

పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా ప్రాణాలకు ముప్పు ఉందని అతడి తండ్రి భయపడుతూనే ఉన్నాడు. భద్రతా సిబ్బందిని వెంట వెళ్లకపోవడం చూసి.. వెంటనే వారిని తీసుకుని కొడుకు వెనుక బయల్దేరాడు. అయినా ఏం

Published : 30 May 2022 16:57 IST

చండీగఢ్‌: పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా ప్రాణాలకు ముప్పు ఉందని అతడి తండ్రి భయపడినట్టే జరిగింది. సిద్దూ తన వెంట భద్రతా సిబ్బందిని తీసుకెళ్లకపోవడం చూసి.. వెంటనే వారిని తీసుకుని కొడుకు వెనకే బయల్దేరాడు. అయినా ఏం లాభం.. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. కళ్లముందే కన్న కొడుకు హత్యకు గురవగా.. ఆ పాశవిక ఘటనకు తండ్రే ప్రత్యక్ష సాక్షి కావడం విచారకరం.

ఆదివారం సాయంత్రం సిద్ధూ తన స్నేహితులతో కలిసి కారులో ఇంటి నుంచి బయల్దేరారు. ఆ సమయంలో సిద్ధూ తన బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనాన్ని గానీ, తన భద్రతా సిబ్బందిని గానీ వెంట తీసుకెళ్లలేదు. ఈ విషయం తెలుసుకున్న ఆయన తండ్రి బాల్‌కౌర్‌ సింగ్‌ ఆందోళనకు గురయ్యారు. సిద్ధూను చంపేస్తామంటూ గతంలో పలుమార్లు వచ్చిన బెదిరింపులు గుర్తొచ్చాయి. క్షణం ఆలస్యం చేయకుండా భద్రతా సిబ్బందిని తీసుకుని మరో కారులో సిద్ధూ వెనుకే వెళ్లాడా తండ్రి.

బాల్‌కౌర్‌ సింగ్ జవహార్‌కే గ్రామానికి చేరుకోగా.. సిద్ధూ కారు ముందు వెనుక పలు వాహనాలు అడ్డంగా కన్పించాయి. ఏం జరిగిందా అని ఆలోచించేలోపు కొందరు వ్యక్తులు సిద్ధూపై బుల్లెట్ల వర్షం కురిపించారు. అది చూసి బాల్‌కౌర్‌ గట్టిగట్టిగా కేకలు పెట్టారు. క్షణాల్లోనే అంతా జరిగిపోయింది. అంతే వేగంగా నిందితులు తమ కార్లలో పారిపోయారు. కళ్లముందే కొడుకుపై కాల్పులు జరుపుతుంటే బాల్‌కౌర్‌ ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. తూటాల దాడిలో తీవ్రంగా గాయపడిన కొడుకును, అతడి స్నేహితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సిద్ధూ ప్రాణాలు కోల్పోయినట్లు బాల్‌కౌర్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ హత్యలో తండ్రే ప్రత్యక్ష సాక్షి కావడం గమనార్హం.

హత్య కేసు అనుమానితుడు.. యాత్రికుల చాటున దాక్కొని..!

సిద్ధూ హత్య కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో మరో అనుమానితుడిని పోలీసులు తాజాగా ఉత్తరాఖండ్‌లో అరెస్టు చేశారు. యాత్రికుల చాటున దాక్కొని పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. సిద్ధూ హత్యకు పాల్పడ్డ దుండగులు ఉత్తరాఖండ్‌ పారిపోయినట్లు సమాచారం రావడంతో పంజాబ్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ రాష్ట్ర పోలీసులు, స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ సహకారంతో సంయుక్త ఆపరేషన్లు చేపట్టారు. అలా దెహ్రాదూన్‌లో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. నేడు మరో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. హేమకుంద్ సాహిబ్ యాత్రకు వెళ్తోన్న భక్తుల మధ్య దాక్కొని ఆ వ్యక్తి పారిపోయేందుకు ప్రయత్నించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆరుగురు అనుమానితుల్లో ఒకరికి లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో సంబంధాలున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని