భారత్‌లో 165.. చైనాలో 19,903

ప్రపంచంలో అత్యధిక జనాభా గల తొలి రెండు దేశాల్లో కొవిడ్‌ కేసుల నమోదుపరంగా పూర్తిగా భిన్నమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి.

Updated : 07 Dec 2022 06:01 IST

 24 గంటల్లో కొవిడ్‌ కేసుల నమోదు

దిల్లీ: ప్రపంచంలో అత్యధిక జనాభా గల తొలి రెండు దేశాల్లో కొవిడ్‌ కేసుల నమోదుపరంగా పూర్తిగా భిన్నమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. చైనాలో తాజాగా కొవిడ్‌ కేసులు పెరుగుతుంటే.. భారత్‌లో చాలా తక్కువగా నమోదవుతుండటం ఆసక్తికర పరిణామం. చైనా మాదిరిగా కఠినమైన లాక్‌డౌన్‌లు, ఇతర ఆంక్షలు విధించకపోవడమే భారత్‌కు ప్రయోజనకరమైందని నిపుణులు అంటున్నారు. భారత్‌లో గడచిన 24 గంటల్లో కేవలం 165 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉదయం 8.00 గంటలకు ప్రకటించింది. అదే సమయంలో చైనాలో 19,903 కొవిడ్‌ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది. భారత్‌, చైనాల మధ్య ఈ తేడాకు కారణమేమిటనే ప్రశ్న సహజంగానే తలెత్తింది. కొవిడ్‌ నిరోధానికి చైనా ఉపయోగించిన టీకాలు భారతీయ టీకాలంత శక్తిమంతమైనవి కాకపోవచ్చని నిపుణుల అంచనా. కొవిడ్‌ నిరోధానికి చైనా పూర్తిగా టీకాల మీదనే ఆధారపడటం తప్పని వీరంటున్నారు. భారత్‌లో కొవిడ్‌ తొలిదశల్లో చాలామందికి కరోనా వైరస్‌ సోకింది. దాని నుంచి బయటపడినవారిలో సహజ రోగనిరోధక శక్తి ఏర్పడింది. తరవాత టీకాలు ఇవ్వడం వల్ల అదనంగా రోగనిరోధక శక్తి చేరింది. ఇలా రెండు రకాల నిరోధకతను హైబ్రిడ్‌ రోగనిరోధక శక్తి అంటారు. భారత్‌ మొత్తం మూడు కొవిడ్‌ విజృంభణలను చూసిందనీ, రెండు డోసుల టీకాలను అత్యధిక జనాభాకు అందించిందని ప్రజారోగ్య నిపుణుడు చంద్రకాంత్‌ లహరియా గుర్తు చేశారు. చైనాలో అధికంగా ఉన్న వృద్ధ జనాభాలో చాలామందికి టీకాలు వేయలేదని తెలిపారు. 2020లో కొవిడ్‌ మిగిల్చిన చేదు అనుభవం భారతీయుల్లో రోగనిరోధకతను పెంచి, 2022లో శుభపరిణామంగా మారిందని వాషింగ్టన్‌లోని వన్‌హెల్త్‌ ట్రస్ట్‌ డైరెక్టరు లక్ష్మీనారాయణ్‌ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం చైనా, అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపాలలో కొత్త ఒమిక్రాన్‌ ఉప వేరియంట్ల వల్ల కేసులు పెరుగుతున్నాయి.కొత్త వేరియంట్లు వస్తే తప్ప భారత్‌లో కేసులు పెరగవని అశోకా వర్సిటీ ఆచార్యుడు గౌతమ్‌ మేనన్‌ చెప్పారు. అయితే, ప్రజలు అప్రమత్తత వీడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని