Nitish Kumar: ముఖ్యమంత్రుల సమావేశానికి నితీశ్‌ డుమ్మా..?

బిహార్‌ రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ శనివారం దిల్లీలో న్యాయశాఖ ఆధ్వర్యంలో జరగనున్న ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించుకొన్నారు

Published : 30 Apr 2022 02:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బిహార్‌ రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ శనివారం దిల్లీలో న్యాయశాఖ ఆధ్వర్యంలో జరగనున్న ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించుకొన్నారు. రాష్ట్రంలో మిత్రపక్షమైన భాజపా తీరుపై అసంతృప్తితోనే నితీశ్‌ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో నితీశ్‌ను మార్చి భాజపాకు చెందిన నాయకుడిని సీఎంగా చేయాలనే డిమాండ్లను కమలనాథులు తరచూ ప్రస్తావిస్తున్నారు.

ఇటీవల భాజపా ఎమ్మెల్యే ఒకరు నితీశ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి ఉప ముఖ్యమంత్రి కిషోర్‌ ప్రసాద్‌ను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్‌ చేశారు. మరోపక్క బుధవారం ఇఫ్తార్‌ విందు సందర్భంగా ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈసమయంలో ఆయన ఉపముఖ్యమంత్రితో అంటీముట్టనట్లు వ్యవహరించారు.  త్వరలో నితీశ్‌కుమార్‌ మంత్రివర్గంలో మార్పులు చేయనున్నారు. ఈ క్రమంలో అసమర్థులైన మంత్రులను తొలగిస్తానని ఆయన సంకేతాలు ఇస్తున్నారు. కొత్తగా అరడజను మంది జేడీయూ,భాజపా నాయకులకు ఈ సారి అవకాశం  రావచ్చని సమాచారం.

ఈ పరిస్థితుల్లో నితీశ్‌ కుమార్‌ తన పదవికి ఐదేళ్లపాటు ఎలాంటి ఇబ్బంది లేదనే హామీని భాజపా అధిష్ఠానం నుంచి కోరుతున్నారు. అయితే.. ఇటీవల రాష్ట్రంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పర్యటనలో ఇలాంటి హామీ రాలేదని భాజపా వర్గాలు చెబుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని