Arvind Kejriwal: ‘నిబంధనలు పాటిస్తే.. దిల్లీలో నో లాక్‌డౌన్‌’

దేశ రాజధాని దిల్లీలో రోజువారీ కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్న విషయం తెలిసిందే. శనివారం ఏకంగా 20 వేలు దాటిపోయాయి. పాజిటివిటి రేటు సైతం 19.60 శాతానికి చేరుకుంది. మరోవైపు మహమ్మారి కట్టడి కోసం ఆప్‌ ప్రభుత్వం ఇప్పటికే వీకెండ్‌ లాక్‌డౌన్‌...

Published : 09 Jan 2022 13:23 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో రోజువారీ కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్న విషయం తెలిసిందే. శనివారం ఏకంగా 20 వేలు దాటిపోయాయి. పాజిటివిటీ రేటు సైతం 19.60 శాతానికి చేరుకుంది. మరోవైపు మహమ్మారి కట్టడి కోసం ఆప్‌ ప్రభుత్వం ఇప్పటికే వీకెండ్‌ లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఇతర ఆంక్షలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దిల్లీలో కొవిడ్‌ పరిస్థితులపై ఆదివారం మాట్లాడారు. స్థానికులు విధిగా మాస్కు ధరించడం, వ్యక్తిగత దూరం పాటించడం వంటి నిబంధనలు పాటిస్తే స్థానికంగా లాక్‌డౌన్‌ విధించాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ‘కేసులు పెరుగుతోన్నా.. భయపడాల్సిన అవసరం లేదు. కానీ బాధ్యతగా ఉండాలి. ఇప్పుడే లాక్‌డౌన్‌ విధించాలని భావించడం లేదు. సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా.. ఆంక్షలు కూడా వీలైనంత తక్కువే ఉండేలా చూస్తున్నాం. సోమవారం నిర్వహించనున్న ప్రత్యేక సమావేశంలో పరిస్థితులను మరోసారి సమీక్షిస్తాం’ అని తెలిపారు.

అర్హులందరూ రెండు డోసులు వేయించుకోవాలని కేజ్రీవాల్‌ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఆదివారం 22 వేల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నందున ఆస్పత్రుల్లో పడకల సంఖ్యను పెంచాలని దిల్లీ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ఇదివరకే తెలిపారు. వైరస్‌ సోకినవారికి సకాలంలో చికిత్స అందించేందుకు రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఇటీవల కరోనా బారిన పడిన కేజ్రీవాల్‌.. తాజాగా తాను పూర్తిగా కోలుకున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని